నిర్మాతగా మారడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా !

బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నిర్మాతగా మారి ప్రాంతీయ భాషా చిత్రాలను నిర్మిస్తున్నారు. అనుష్క శర్మ తన అభిరుచి మేరకు విభిన్న కథా చిత్రాలను నిర్మిస్తూ అందులో తానే నటిస్తోంది. వీరి మాదిరిగానే ఇప్పుడు దీపికా పదుకొనె కూడా నిర్మాతగా మారబోతుందట. తనకు ఓ ప్రొడక్షన్‌ కంపెనీని ప్రారంభించాలనుందని ఇటీవల వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చెబుతూ…. ‘సినిమాలు నిర్మించడమంటే నాకు ఇష్టం. అందుకే ఓ ప్రొడక్షన్‌ సంస్థను ప్రారంభించాలనుంది. దీని ద్వారా నేను అనుకున్న విజన్‌ను నెరవేర్చుకోవాలనుకుంటున్నా. ప్రొడక్షన్‌ ప్రారంభానికిది మంచి టైమ్‌గా భావిస్తున్నా. కచ్చితంగా ఇది మహత్తరంగా ఉంటుంది. నిర్మాతగా మారడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూనే కొత్తదనాన్ని ఆవిష్కరించడానికిది మంచి ఛాన్స్‌’ అని తెలిపింది. ఇటీవల దీపికా ‘పద్మావత్‌’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం విదితమే. అనారోగ్య కారణంగా ప్రస్తుతం విశ్రాంతిలో ఉంది. ఇదిలా ఉంటే ‘జీరో’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో మెరవనుంది.

చెల్లి, అమ్మతో కలిసి షాపింగ్‌ 

ప్రేమ పక్షులు దీపికా పదుకొనే, రణవీర్‌ సింగ్‌ల వివాహానికి సబంధించిన వార్తలు ఇప్పటికే చాలా సార్లు వినిపించాయి. తాజాగా మరో సారి ఈ జంట ఒక్కటవ్వబోతుందన్న వార్త తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జోడి ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వాలని భావిస్తున్నారట.

దీపికా తల్లిందండ్రులు పెళ్లి తేదిని ఖరారు చేసినట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌, డిసెంబర్‌ల మధ్య ఉన్న నాలుగు తేదీలను చూశారని, వాటిలో ఒక తేదిని ఫిక్స్‌ చేయనున్నట్లు సమాచారం. పెళ్లి కోసమై ఈ అమ్మడు తన చెల్లి, అమ్మతో కలిసి షాపింగ్‌ కూడా మొదలు పెట్టిందట.

ఈ విషయంపై రణవీర్‌ ఓ మీడియా సమావేశంలో స్పందిస్తూ.. ‘ఈ విషయం ఎవరు బయటపెట్టారో నాకు తెలియదు. కానీ మా ఆలోచన మాత్రం అదే. పెళ్లి సంబంధించిన పనులను మొదలుపెట్టాం. వీలైనంత తొందరలో మా పెళ్లి జరుగుతుంది. కానీ ఇంకా డేట్‌ ఫిక్స్‌ కాలేద’ని తెలిపారు.

కాగా దీపికా పదుకోనె త్వరలో విశాల్‌ భరద్వాజ్‌ చిత్రంలో నటించనుంది. రణవీర్‌ సింగ్‌.. జోయా అక్తర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గల్లీ బాయ్‌’ తో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో ‘సింబా’ చిత్రాల్లో నటిస్తున్నారు.