చెయ్యకూడని పనులు చెయ్యాలని చెప్పేవారు !

నటీమణుల్లో దీపికా పదుకోనే ‘టాప్ ఇన్ బాలీవుడ్‌’  అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడామెకు పేరు, డబ్బు రెండూ ఉన్నాయి. కానీ అందరిలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వేధింపులు ఎదురయ్యాయని దీపికా చెప్పడం విశేషం. తన జీవితంలో డిప్రెషన్‌తో పోరాడిన ఘటన గురించి ఆమె ఎన్నోసార్లు చెప్పినా.. ఇలా లైంగిక వేధింపుల గురించి ఆమె పబ్లిగ్గా నోరు విప్పడం ఇదే తొలిసారి. ఒక ఇంటర్వ్యూలో దీపికా ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘మీ టూ’, ‘టైమ్స్ అప్’ అనే ప్రచారాలు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీల్లో పెను మార్పులకు కారణమయ్యాయని దీపికా అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై అడుగులు సరైన దిశలోనే పడుతున్నాయి. ఇండియాలోనూ అదే జరుగుతున్నది అని ఆమె చెప్పింది. కెరీర్ తొలినాళ్లలో తనపై కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఒత్తిడి తెచ్చారని, ఎన్నో చెత్త సలహాలు ఇచ్చారని ఈ సందర్భంగా దీపికా చెప్పడం విశేషం. బాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతల కళ్లలో పడటానికి కొన్ని చేయకూడని పనులు చేయాలని చెప్పారు. కానీ నేను అలా చేయలేదు. ఎప్పుడూ నా ఆత్మవిశ్వాసాన్నే నేను నమ్ముకున్నాను అని దీపికా తెలిపింది.

హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసు తెరపైకి వచ్చిన తర్వాత.. సుమారు వంద మంది హాలీవుడ్ నటీమణులు తమపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని పబ్లిగ్గా చెప్పిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల వరకు ఇండియాలో మీ టూ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా.. కల్కి కొచిన్, రిచా చద్దాలాంటి హీరోయిన్లు బాలీవుడ్‌లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పడంతో ఇక్కడా ఆ ప్రచారం జోరందుకుంది.

నవంబర్‌10 బెస్ట్‌ అనిపించిందట !

దీపికా–రణ్‌వీర్‌ల పెళ్లి ముహూర్తం కుదిరింది. ఈ ఏడాది నవంబర్‌ 10న ఈ ఇద్దరూ ఒకటి కాబోతున్నారట. సరైన డేట్‌ కోసం కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఈ జంటకు  నవంబర్‌10 బెస్ట్‌ అనిపించిందట. అనుష్కా శర్మ, విరాట్‌ కోహ్లీలానే వీళ్లద్దరు కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారని భోగట్టా. వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ఆల్రెడీ జనవరిలో దీపికా బర్త్‌డే అప్పుడు మాల్దీవ్స్‌లో ఎవరికీ తెలియకుండా దీపికా, రణ్‌వీర్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలు కూడా వినిపించాయి. కేవలం కుటుంబ సభ్యులు, మిత్రుల మధ్య  వివాహం చేసుకున్నాక ఇండస్ట్రీ వాళ్ల కోసం బెంగళూర్‌లో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారని టాక్‌. పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ కూడా ఆల్రెడీ మొదలెట్టారట. రెండు కుటుంబాలూ మెహందీ, సంగీత్‌.. అంటూ పెళ్లికి సంబంధించిన వేడుకలను ఘనంగా ప్లాన్‌ చేస్తున్నారట.