ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ‘ఓకే’ లేదు !

బాలీవుడ్‌లో ప్రతి సినిమా సినిమాకు స్టార్స్ రేంజ్ మారుతుంటుంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో అయితే చాలా మార్పులు వస్తాయి. ఓ సినిమా హిట్ అయితే మాత్రం పారితోషికం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల పరిస్థితి అలాగే ఉంది. అదేవిధంగా ఒక్క హిట్ వస్తే చాలు వరుసగా మంచి ఆఫర్లు వచ్చేస్తున్నాయి. అయితే ఇటీవల ‘పద్మావత్’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దీపికా పదుకునే మాత్రం ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఓకే చెప్పడం లేదట. దీంతో అనేక రూమర్లు వస్తున్నాయి….

ముఖ్యంగా తన బాయ్‌ఫ్రెండ్ రణవీర్‌సింగ్‌తో దీపిక పెళ్లి మరికొన్ని రోజుల్లో జరుగనుందని… అందుకే ఆమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వాలని అనుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. ఈమధ్య హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం చూసి తాను కూడా ఒక ఇల్లాలిగా జీవితంలో స్థిరపడాలని దీపిక భావిస్తోందట. అయితే గత కొంత కాలంగా దీపిక మెడ నొప్పితో బాధపడుతుండడంతో సినిమాలను ఒప్పుకోవడం లేదని కూడా తెలిసింది. అదేవిధంగా రెమ్యునరేషన్ విషయంలో సెట్ కాక… అలాగే తనకు నచ్చిన పాత్రలు రాకపోవడం మరో కారణమని కూడా అంటున్నారు. అయితే ఈ విషయాలపై దీపిక పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ‘జీరో’. షారుఖ్‌ఖాన్ మరుగుజ్జుగా కనిపించనున్న ఈ సినిమాలో దీపికతో పాటు అనుష్క శర్మ కూడా నటిస్తోంది.