నేను వేరేలా అర్థం చేసుకుని బాధపడేదాన్ని!

“నన్ను నవ్వించడానికి, సంతోషంగా ఉంచడానికి ఎవరైనా మంచి పాట పెట్టినా సరే… నేను దాన్ని వేరేలా అర్థం చేసుకుని బాధపడేదాన్ని”… అని తను డిప్రెషన్‌కి గురయినపుడు పరిస్థితిని దీపికా పదుకొనె చెప్పారు. ” ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్‌కి గురవ్వడం అత్యంత సహజం. నేనూ ఇటువంటి సందర్భాన్ని ఎదుర్కొన్నా… ఒత్తిడితో యుద్ధం చేశా”అని బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొనె చెప్పారు.
నేను డిప్రెషన్‌కి 2014లో గురయ్యాను. ఓ రోజంతా పని చేసి స్పృహ తప్పి పడిపోయాను. ఉదయం నిద్రలేవగానే ఏదో తెలియని బాధతో బాగా ఏడ్చేశాను. అప్పట్నుంచి ఎప్పుడూ విచారంగా ఉంటూ.. అసలు నిద్ర పట్టేది కాదు. నన్ను నవ్వించడానికి, సంతోషంగా ఉంచడానికి ఎవరైనా మంచి పాట పెట్టినా సరే… నేను దాన్ని వేరేలా అర్థం చేసుకుని బాధపడేదాన్ని. ఆ పరిస్థితుల్లో ఓసారి మా పేరెంట్స్‌ వచ్చారు. వాళ్ళు ఉన్నన్ని రోజులూ ధైర్యంగా ఉన్నట్టు నటించినా…వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఏడ్చేసాను. మా అమ్మ నా పరిస్థితిని అర్థం చేసుకుని డాక్టర్‌ దగ్గరికెళ్ళమని చెప్పి… నేను మామూలు స్థితికి వచ్చేవరకు అనుక్షణం నాకు సహకరించింది.. అదే టైమ్‌లో రణ్‌వీర్‌ పరిచయం అయ్యి… మేమిద్దరం ప్రేమించుకోవడం జరిగింది. అలాగే, నాకెప్పటికీ గుర్తుండిపోయే మూడు సినిమాల్లో నటించడం.. ఇవన్నీ నాకెంతో ధైర్యాన్నిచ్చాయి‘ అని దీపికా తెలిపింది. ఆ తర్వాత మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిలో చైతన్యం కోసం ‘ది లివ్-లవ్-లాఫ్ ఫౌండేషన్‘ అనే సేవ సంస్థను ప్రారంభించింది.
 
బాలీవుడ్‌ ‘చార్లీస్ ఎంజెల్స్‌’ లో దీపిక
ఈ ముగ్గురు కలిసి ఓ యాక్షన్‌ కామెడీ చిత్రం చేస్తే ఎలా ఉంటుంది?….ఊహిస్తే ‘అద్బుతం’ అనిపించడం ఖాయం.దీపికా పదుకొనె ‘పద్మావతి’, ‘బాజీరావు మస్తానీ’, ‘త్రిబులెక్స్‌’, ‘పీకూ’ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. కత్రినా కైఫ్‌ ‘టైగర్‌ జిందా హై’, ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘ఏక్‌ ద టైగర్‌’ చిత్రాల్లో అద్భుతమైన పోరాటాల్లో నటించి ఆకట్టుకుంది. రాణి ముఖర్జీ ‘మర్దాని’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’ వంటి చిత్రాల్లో చేసి శభాష్‌ అనిపించుకుంది. అన్నీ కుదిరితే ఈ ముగ్గురు కలిసి ఓ యాక్షన్‌ కామెడీ సినిమాతో వెండితెరపై హల్‌చల్‌ చేయబోతున్నారు. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన లేడీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ కామెడీ ‘చార్లీస్ ఎంజెల్స్‌’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కామెరాన్‌ డియాజ్‌, డ్రూ బార్రీమోర్‌, ల్యూసీ లియు ప్రధాన పాత్రధారులుగా మెక్‌ జీ దర్శకత్వంలో 2000లో వచ్చిన ‘చార్లీ ఏంజెల్స్‌’ చిత్రం సంచలన విజయం సాధించింది. 2003లో దీనికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. బాలీవుడ్‌ ‘చార్లీస్ ఎంజెల్స్‌’ లో దీపికా, కత్రినాతోపాటు తాను కూడా నటిస్తే బాగుంటుందని రాణిముఖర్జీ ఇటీవల తన మనసులో మాట చెప్పేసింది. దీపికా ప్రస్తుతం ‘ఛపాక్‌’, ’83’ చిత్రాల్లో, కత్రినా కైఫ్‌ ‘సూర్యవంశీ’, రాణి ముఖర్జీ ‘మర్దాని 2’లో చేసారు.
 
‘త్రిబులెక్స్‌’ సిరీస్‌లో మరోసారి దీపిక
దీపికా పదుకొనె హాలీవుడ్‌లో ‘త్రిబులెక్స్‌:రిటర్న్‌ ఆఫ్‌ గ్జెండర్‌ కేజ్‌’ చిత్రంలో చేసింది. తాజాగా మరోసారి హాలీవుడ్‌ ఆడియెన్స్‌ని అలరించడానికి సిద్ధమవుతుంది. ‘త్రిబులెక్స్‌’ సిరీస్‌లో భాగంగా రాబోయే నాలుగో చిత్రంలో మెయిన్‌ లీడ్‌గా దీపికా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డీజే కరుసో స్పష్టం చేసారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి కరుసో స్పందిస్తూ.. ‘దీపికాతో పనిచేయాలని మేం కూడా అనుకుంటున్నాం. కొత్త ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పూర్తయ్యింది. త్వరలో దీపికాని కలుస్తాం’ అని ట్వీట్‌ చేశారు.
మేఘనా గుల్జార్‌ రూపొందిస్తున్న ‘ఛప్పాక్‌’, కబీర్‌ఖాన్‌ తెరకెక్కిస్తున్న ’83’ చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం దీపికా బిజీగా ఉంది