ప్రకృతి సోయగాల నడుమ ఇటలీలో వీరి పెళ్లి !

అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్‌లు త‌మ‌కి న‌చ్చిన వారిని ప్రేమ వివాహం చేసుకోగా, ప్రియాంక చోప్రా అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌తో త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నుంది. ఇక దీపిక‌-ర‌ణ్‌వీర్‌ల వివాహంపై కొన్నాళ్ళ‌నుండి ప‌లు వార్త‌లు వినిపిస్తున్నా, వాటిపై క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా వీరి పెళ్లికి వివాహ వేదిక ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది.నవంబర్‌ 10న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారనే ప్రచారం సాగుతోంది. వీరి వివాహం ఇటలీలోని కోమో సరస్సు సమీపంలోని అద్భుత లొకేషన్స్‌లో జరగనుందని చెబుతున్నారు. ఉత్తర ఇటలీలోని లంబార్డీ ప్రాంతంలో మైమరిపించే ప్రకృతి సోయగాల నడుమ ఈ సరస్సు ఉండటంతో వివాహ వేదికగా ఈ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నట్టు తెలిసింది.సరస్సు చుట్టూ నిర్మించిన విల్లాలు అతిధులకు విడిదిగా మారనున్నాయి. మరోవైపు ఆల్ప్‌ పర్వత శ్రేణులు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా చెబుతున్నారు.డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనున్న ఈ జంట ముంబైలో రిసెప్ష‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. 
 
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లికి సంబంధించిన షాపింగ్ ఇప్ప‌టికే పూర్తైంది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. త్వ‌ర‌లో నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తంతు కూడా ముగించేయ‌నున్నారని అంటున్నారు. పెళ్లి తర్వాత తాము కలిసి ఉండబోయే ఇంటిని కూడా వీళ్లు ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్‌వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
 
కొన్నాళ్ళుగా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న దీపికా ప్ర‌స్తుతం కోలుకుంది. ‘ప‌ద్మావ‌తి’ చిత్రం త‌రువాత నాగ్పాడాకు చెందిన ‘మాఫియా క్వీన్’ రహీమా ఖాన్ జీవిత సినిమా చేయాల‌నుకుంది దీపిక‌.కాని ఈ మూవీని పెళ్లి త‌ర్వాత‌నే చేయ‌నుంద‌ని అంటున్నారు. ఇక ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌స్తుతం ‘గ‌ల్లీ బాయ్’ , ‘టెంప‌ర్’ రీమేక్ ‘సింబా’ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలని న‌వంబ‌ర్ లోపు పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.