‘పద్మావత్’ పై కర్ణిసేన పెద్దల ప్రశంసలతో రగడకు తెర !

‘పద్మావత్’ ఎంత కాంట్రవర్సీగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ షూటింగ్ దశలోనే కర్ణిసేన కార్యకర్తలు అడుగడుగున అడ్డుపడ్డారు. పలుమార్లు సినిమా సెట్టింగ్‌ను కూడా దగ్ధం చేశారు. ఇలా నిరసనల మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది పద్మావత్. అయితే అసలు కథ ఆ తరువాతే మొదలైంది. సినిమాను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని కోరుతూ కర్ణిసేన ఆందోళన బాట పట్టింది. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి తమ రాష్ట్రాల్లో మూవీని విడుదల చేయట్లేమని ప్రకటించేశాయి. ముందు మూవీ చూసి అనంతరం అభ్యంతరం ఉంటే చెప్పాలని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కోరినప్పటికీ వినిపించుకోలేదు. సరికదా, ఇంకా ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది.

ఆ తరువాత సెన్సార్ బోర్డు కలిపించుకొని మూవీ టైటిల్ మార్పుతో పాటు పలు సన్నివేశాల తొలగించి విడుదల చేసుకోవాలని చెప్పింది. దీంతో జనవరి 25న మూవీ విడుదలైంది. అయినా కర్ణిసేన ఆందోళనలు మాత్రం ఆగలేదు. తాజాగా సినిమాపై మనసు మార్చుకుంది కర్ణిసేన. మూవీ చూసిన కర్ణిసేన పెద్దలు ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా చూశాక తమ అభిప్రాయాన్ని మార్చుకొన్నామని, ఆందోళనలను విరమించుకుంటున్నట్లు వెల్లడించారు. మూవీలో రాజ్‌పుత్‌ల శౌర్యాన్ని గొప్పగా ప్రశంసించారని, పద్మావత్ తమ గౌరవాన్ని పెంచేలా ఉందని ముంబయి నేత యోగేంద్ర సింగ్ కటార్ అన్నారు. రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతకరమైన సన్నివేశాలు లేవన్నారు. ప్రతి రాజ్‌పుత్ చిత్రాన్ని చూసి గర్వపడతారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కూడా సినిమా విడుదలయ్యేందుకు సహకరిస్తామన్నారు కర్ణిసేన నేతలు. దీంతో పద్మావత్ రగడకు తెర పడింది.

నిరసన యథాతథంగా కొనసాగుతుంది !

పద్మావత్‌  రాజ్‌పుత్‌ల ధైర్యసాహసాలను చాటేలే, వారి గౌరవాన్ని ఇనుమడించేలా ఉందని పేర్కొంటూ.. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలను విరమించుకుంటున్నట్లు కర్ణిసేన పేరుతో ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణిసేన తాజాగా వివరణ ఇచ్చింది. పద్మావత్‌ సినిమాకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు విరమించుకోలేదని, సినిమాపై తమ నిరసన యథాతథంగా కొనసాగుతోందని తాజాగా కర్ణిసేన జాతీయ నాయకులు లోకేంద్ర సింగ్‌ కల్వీ, సుఖ్‌దేవ్‌ సింగ్‌ గొగమేడి తెలిపారు.

కర్ణిసేన ముంబై చీఫ్‌ యోగేంద్ర సింగ్‌ కటార్‌తోపాటు ముంబై విభాగపు బాధ్యులు పద్మావత్‌ సినిమాపై తమ ఆందోళనలు విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, దేశవ్యాప్తంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన కల్వీ, గొగమేడి మాత్రం ఈ ప్రకటనను ఖండించారు. శ్రీరాజ్‌పుత్‌ కర్ణిసేనకు కల్వీ జాతీయస్థాయిలో నాయకత్వం వహిస్తుండగా.. రాజ్‌పుత్‌లకు సంబంధించిన మరో జాతీయ సంఘమైన శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేనకు గోగమేడి జాతీయాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అనుకూలంగా ప్రకటన ఇచ్చినందుకు యోగేంద్రతోపాటు.. ఆ ప్రకటనలో సంతకాలు చేసిన ఇతరులను సైతం తమ సంఘం నుంచి బహిష్కరించినట్టు గోగమేడి తెలిపారు. పద్మావత్‌ సినిమాపై తమ అభ్యంతరాలు పరిష్కారం కాలేదని, తాము ఆందోళన విరమించుకున్నట్టు సోషల్‌ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదని వివరించారు.

పీకే, ధూమ్ 3, దంగ‌ల్‌, భ‌జ‌రంగీ బాయిజాన్ రికార్డుల‌ బ్రేక్ !

రాణి ప‌ద్మావ‌తి జీవిత నేప‌ధ్యంలో సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ప‌ద్మావ‌త్‌’. జ‌న‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. ఇప్పటికే 200 కోట్ల వసూళ్ళ దిశగా ఈ చిత్రం విజయ యాత్ర చేస్తోంది .  కేవ‌లం ఇండియాలోనే కాక నార్త్ అమెరికాలోను ప‌ద్మావ‌త్ సినిమాకి భారీ వ‌సూళ్ళు ల‌భిస్తున్నాయి. తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా పద్మావ‌త్ మూవీ గ‌త చిత్రాలు పీకే, ధూమ్ 3, దంగ‌ల్‌, భ‌జ‌రంగీ బాయిజాన్ చిత్రాల పేరిట ఉన్న రికార్డుల‌ని చెరిపేసింది. యూఎస్‌, కెన‌డాల‌లో క‌లిపి ప‌ద్మావ‌త్ చిత్రం $1,841,628 వ‌సూళ్ళు సాధించిన‌ట్టు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్వీట్ ద్వారా తెలిపారు. ఎన్నో వివాదాల మ‌ధ్య విడుద‌లై ప‌ద్మావ‌త్ చిత్రం కేవలం పెయిడ్ ప్రివ్యూల ప్రదర్శనతోనే ఆ సినిమా రూ.5 కోట్లు రాబ‌ట్టింది.