వాటి పుణ్యమా అని ‘లిప్ లాక్’ లేని సినిమా లేదు !

‘ఆర్ ఎక్స్ 100’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల పుణ్యమా అని లిప్ లాక్ లు లేని తెలుగు సినిమా ఉండటం లేదు. ముఖ్యంగా కాలేజ్, స్టూడెంట్ కంటెంట్ చిత్రాలంటే తప్పనిసరిగా అలాంటి సన్నివేశాలుంటున్నాయి. ఈ వైఖరి మారాలని మా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవిత అన్నారు. వరుణ్, దివ్య హీరోహీరోయిన్లుగా గతంలో అవార్డు చిత్రాలను రూపొందించిన నరసింహ నంది దర్శకత్వంలో  శ్రీ లక్ష్మీనరసింహ సిినిమా పతాకం నిర్మిస్తున్న ‘డిగ్రీ కాలేజ్’ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్లో జరిగింది. ట్రైలర్ తో పాటు చిత్రం మొదటి పోస్టర్ ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీమతి జీవిత రాజశేఖర్ విడుదలచేశారు.
అనంతరం జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే…దానిని విడుదల చేయడం మరొక ఎత్తు అయిపోయింది. సినిమా పట్ల ఉన్న అభిరుచితో ఎన్ని కష్టాలనైనా అధిగమించి మరీ నాలా ఎంతోమంది సినిమాలను తీస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు కూడా అలానే కష్టపడి ఈ సినిమాను తీసుంటారు. నా ఉద్దేశ్యంలో ఎవరైనా సరే సినిమాలను తీసేటప్పుడు సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలి. సినిమా అనేది వ్యక్తిగతంగా చూసేది కాదు. సమూహం కలిసి చూసేది. ఈ విషయాన్ని పరిశ్రమలోని వారు దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నారు.
చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ… ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ వంటి  సామాజిక చైతన్యం కలిగించే సందేశాత్మక సినిమాలను గతంలో చేశాను. వాటికి అవార్డులు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. అదే నేను రూపొందించిన హైస్కూల్ చిత్రానికి డబ్బులు బాగా వచ్చాయి. అందుకే నా పంథాను మార్చి…నా శైలిని ప్రతిబింబిస్తూ కమర్షియల్ అంశాలను మిళితం చేసి..నాదైన నవ్యపంథాలో ఈ సినిమా తీశాను. ట్రైలర్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా అంతా వల్గారిటీగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇందులో మంచి కంటెంట్ ఉంది. పేపర్ లో ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమకథకు సంబంధించి వచ్చిన ఆర్టికల్ ను చదివి…వారి ఊరికి వెళ్లాను. యథార్థ ఘటనలను సేకరించి…వాటికి సినిమాటిక్ అంశాలను పొందుపరిచి ఈ చిత్రాన్ని తీశాను.  వాళ్లు కాలేజ్ లో, బయటా ఎలా ఉండేవారన్న అంశాలను ఇందులో చిత్రీకరించాం. ఇందులోని సంఘటనలు, ఎమోషన్స్ కొత్తగా ఉంటాయి. ఇందులోని లిప్ లాక్ లు, శృంగారభరిత సన్నివేశాలు కథ డిమాండ్ మేరకే పెట్టాం. దీనికి సంబంధించి ఎలాంటి కాంట్రవర్శీని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో వరుణ్, సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, బత్తుల కొండయ్య, రవిరెడ్డి తదితరులు బలమైన కంటెంట్ ఈ చిత్రంలో ఉందన్నారు. చిత్రాన్ని చూసినవాళ్లు బరువెక్కిన హృదయంతో థియేటర్ నుంచి  బయటకు వస్తారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు సలీమ్, మల్లేష్, కెమెరామెన్ మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.