దేవరాజ్‌ తనయుడు ప్రణవ్‌ దేవరాజ్‌ హీరోగా ‘వైరమ్‌’ ప్రారంభం !

కన్నడ నటుడు దేవరాజ్‌ తనయుడు ప్రణవ్‌ దేవరాజ్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘వైరమ్‌’. సాయి శివన్‌.జె దర్శకత్వం వహిస్తున్నారు. జె. మల్లికార్జున్‌ నిర్మాత. హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు వి.సాగర్‌ క్లాప్‌నిచ్చారు. వి.ఎన్‌.ఆదిత్య కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శ్రీవాస్‌ గౌరవ దర్శకత్వం వహించారు. కాశీ విశ్వనాథ్‌, గోపీనాథ్‌ స్క్రిప్టుని అందజేశారు.’ఆర్.ఎక్స్. 100′ హీరో కార్తికేయ శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు సాయి శివన్‌.జె మాట్లాడుతూ… ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే వినూత్నమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేక్షకులు కోరే కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కథానాయకుడు ప్రేమ కోసం ఎవరితో, ఎలా పోరాటం చేశాడనేది తెరపైనే చూడాలి. ఐదు పాటలు, ఏడు యాక్షన్‌ ఘట్టాలుంటాయి. మహతి సాగర్‌ వినసొంపైన స్వరాల్ని అందించార’’న్నారు.

నిర్మాత జె. మల్లికార్జున్‌ మాట్లాడుతూ…‘‘వచ్చే నెల నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. హైదరాబాద్‌తో పాటు, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు.

కథానాయకుడు ప్రణవ్‌ దేవరాజ్‌ మాట్లాడుతూ…‘‘కన్నడలో రీమేక్‌ చేసిన తెలుగు చిత్రం ‘కుమారి 21 ఎఫ్‌’తో తెరకు పరిచయం అయ్యాను. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా. దర్శకుడు కథ చెప్పేటప్పుడే సినిమా కళ్లకి కట్టింద’’న్నారు .

దేవరాజ్‌ మాట్లాడుతూ…‘‘తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించినట్టుగానే మా అబ్బాయిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాన’’ అన్నారు .

విన్ను మద్దిపాటి, స్వప్న, మల్లిఖార్జున, శత్రు, ప్రమోదిని, కాశీ విశ్వనాథ్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః గోపీనాథ్, సంగీతంః సాగర్ మహతి, ఆర్ట్‌ః పి.వి.రాజు.