అందువల్లే సక్సెస్‌ఫుల్‌గా రాణించగలుగుతున్నా!

‘రెగ్యులర్ కమర్షియల్‌  కథానాయిక పాత్రలు నేను చేయలేను. వాటికి నేను సరిపోను కూడా’ అని అంటోంది విద్యాబాలన్‌.కమర్షియల్‌ కథానాయికలకు భిన్నంగా ఒక ప్రామాణికమైన నటనా శైలిని ప్రదర్శిస్తూ బాలీవుడ్‌లో రాణిస్తోంది విద్యా. హీరోయిన్‌గా రాణించేందుకు స్లిమ్‌గానే ఉండాల్సిన పనిలేదు, బొద్దుగా ఉన్నా నటనలో ప్రత్యేకత ఉంటే రాణించడం ఈజీ అని నిరూపించిందామె. ‘డర్టీపిక్చర్‌’తో జాతీయ ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకుంది విద్యాబాలన్‌.

బాలీవుడ్‌లో రాణించడంపై స్పందిస్తూ…’కెరీర్‌ తొలి నాళ్ల నుంచి నాకు భిన్నమైన, నవ్యమైన పాత్రలే వచ్చాయి. అలా రావడం కూడా గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. విభిన్నమైన చిత్రాలు చేయడం వల్లే నేను బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణించగలుగుతున్నాను. ఇన్నేండ్లు ఇండిస్టీలో మనుగడ సాధించగలుగుతున్నాను. ఒక నటిగా మనం ఎప్పుడూ మంచి  పాత్రల కోసం ఆకలిగా వెయిట్‌ చేయాలి. పాత్రల ద్వారా మరో వ్యక్తి జీవితంలో జీవించేందుకు సిద్ధంగా ఉండాలి. అలాంటి పాత్రలు నాకు చాలా వచ్చాయి. అదే సందర్భంలో కమర్షియల్‌ సినిమాలు కూడా ముఖ్యమే. కమర్షియల్‌ సక్సెస్‌ వాటితోనే వస్తుంది. అలాగని వాటి కోసమే వెయిట్‌ చేయకూడదు.సాంప్రదాయ విరుద్ధమైన పాత్రలు చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా’ అని తెలిపింది.