య‌థార్థ ఘ‌ట‌న‌కు పునఃసృష్టి … ‘కృష్ణం’

పి.ఎన్‌.బి. క్రియేష‌న్స్ ప‌తాకంపై యదార్ధ సంఘటనల ఆధారాంగా తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘కృష్ణం’. అక్ష‌య్ కృష్ణ‌న్‌, అశ్వ‌రియా ఉల్లాస్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ బాబు దర్శకత్వంలో నిర్మాత పి.ఎన్‌.బ‌ల‌రామ్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత పి.ఎన్‌.బ‌ల‌రామ్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ… ”య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాలు తెర‌కెక్క‌డం త‌రుచుగా జ‌రిగే విష‌య‌మే. అయితే త‌న జీవితంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న ఆధారంగా రూపొందిన సినిమాలో.. తానే క‌థానాయ‌కుడిగా న‌టించ‌డ‌మనేది  ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు ఏ చిత్రం విష‌యంలోనూ జ‌ర‌గ‌లేదు. అయితే.. మొట్ట‌మొద‌టి సారిగా అలా ఓ చిత్రం తెర‌కెక్కింది. అదే మా ‘కృష్ణం’. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రూపొందిన ఈ చిత్రం అక్ష‌య్ కృష్ణ‌న్ అనే ఓ యువ‌కుడి జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కింది. థ్రిల్లింగ్‌గా సాగుతూనే ఆలోచ‌న రేకెత్తించేలా ఉండే ఈ చిత్రంలోని ప్ర‌తి అంశం ప్ర‌త్యేకంగా ఉంటుంది. అలాగే భావోద్వేగాల‌కు పెద్ద‌పీట వేస్తూ రూపొందిన ఈ సినిమాలో ప్ర‌తీ స‌న్నివేశం ఊహ‌కంద‌ని విధంగా సాగుతుంది. అంతేగాకుండా.. ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ చివ‌రి వ‌ర‌కు ప్రేక్ష‌కుడ్ని కుర్చీ అంచున కూర్చోబెట్టేంత ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ సినిమా ఉంటుంది. తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమా.. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ఏప్రిల్ నెల‌లో విడుదల చేయాలనుకుంటున్నాం.

”ఓ టీనేజ్ కుర్రాడు త‌న జీవితంలో ఎదురైన ఓ అనూహ్య సంద‌ర్భాన్ని ఎలా అధిగ‌మించాడు అనే పాయింట్‌తో ‘కృష్ణం’ చిత్రం తెర‌కెక్కింది. దినేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఇప్ప‌టికే ‘ల‌హ‌రి మ్యూజిక్’ ద్వారా విడుద‌లైన మా సినిమాలోని పాట‌ల‌కు యూట్యూబ్‌లో మంచి స్పంద‌న వ‌స్తోంది” అని తెలియజేసారు..

అక్ష‌య్ కృష్ణ‌న్‌, అశ్వ‌రియా ఉల్లాస్‌, మ‌మితా బిజ్జు, సాయికుమార్‌, రెంజీ ప‌ణిక్క‌ర్‌, శాంతి కృష్ణ, సమీర్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యం : సంధ్య‌, సంగీతం : హ‌రిప్ర‌సాద్‌, నిర్మాత : పి.ఎన్‌.బ‌ల‌రామ్, క‌థ‌నం-ఛాయాగ్ర‌హ‌ణం-ద‌ర్శ‌క‌త్వం : దినేష్ బాబు.