వివాదంలో చిక్కుకున్న భారీ చిత్రం ‘ములాన్‌’

‘ములాన్‌’ 1998లో విడుదలైన యానిమేటెడ్‌ చిత్రానికి రీమేక్‌గా తీసిన చిత్రం. వాల్ట్‌ డిస్నీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే డిస్నీ ప్లస్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. భారీ బడ్జెట్‌ తో నిర్మితమైన ‘ములాన్‌’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిరసన వ్యక్తం అవుతోంది. అయితే శుక్రవారం చైనా వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రదర్శన నిలిపివెయ్యలంటూ హాంకాంగ్‌, థారులాండ్‌, తైవాన్‌లలో నిరసనలు,ప్రదర్శనలు జరిగాయి. ‘బాయ్ కాట్ ములాన్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలోనూ విసృత్తంగా వైరల్‌ చేశారు. అలాగే అమెరికా కూడా డిస్నీ సంస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘ములాన్‌’ సినిమాపై ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలేమిటంటే… ములాన్‌ పాత్ర పోషించిన లియూ ఈఫే చైనాకి చెందిన అమెరికన్‌ నటి. గతేడాది చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైనాకి చెందిన ఓ జర్నలిస్ట్‌పై ఆందోళనకారులు జరిపిన దాడిని ఖండిస్తూ.. హాంకాంగ్‌ పోలీసులకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌ అప్పట్లోనే ఓ దుమారం రేపింది. ఈ పోస్ట్‌ వల్ల ఆమె నటించిన ఈ సినిమాని బాయ్ కాట్‌ చేయాలని హాంకాంగ్‌ ప్రజలు కోరుతున్నారు. ఈ చిత్రంలో కొంత భాగాన్ని చైనాలోని జింజియాంగ్‌ ప్రావిన్సులో చిత్రీకరించడం మరో కారణంగా నిలిచింది. ఎందుకంటే ఉరుగర్‌ వంటి ముస్లిం వర్గాలు ఎక్కువగా నివసించేది ఈ ప్రాంతంలోనే. పెద్ద ఎత్తున నిర్భంద కేంద్రాలను నిర్మించి.. చైనా వీళ్ళని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. ఆ నిర్భంద కేంద్రాలను ‘ములాన్‌’ సినిమాలో చూపించి ఉండొచ్చనే అనుమానంతో ప్రదర్శనను నిలిపి వేయాలంటున్నారు. ఈ కారణాలతో చైనా వ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా వార్తలను ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలకు చైనా అధికారులు ఇప్పటికే సూచించారు. దీంతో ఈ సినిమా ప్రదర్శన జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది.