కొరుకుడు ప‌డ‌ని… ‘కల్కి’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25/5

హ్యాపి మూవీస్‌, శివాని శివాత్మిక మూవీస్‌ బ్యానర్ల పై ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం లో సి.కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
కధలోకి వెళ్తే… స్వ‌తంత్ర‌భార‌తంలో కొన్ని సంస్థానాలు విలీనం అవుతుంటాయి. అలా కొల్లాపూర్ సంస్థానం కూడా విలీన‌మ‌వుతుంది. ప్ర‌జాస్వామ్య‌దేశంలో ఎన్నిక‌లు మొద‌ల‌వుతాయి. న‌ర్స‌ప్ప అక్క‌డ పోటీ చేస్తాడు. అయితే ఆమెకు ఎదురుగా రాజ‌మాత‌ను నిల‌బెడుతారు. ఆమెనే ప్ర‌జ‌లు గెలిపించుకుంటారు. ప్ర‌జ‌ల‌ను సొంత బిడ్డ‌ల్లా చూసుకుంటుంది రాజ‌మాత‌. ఒక‌రోజు పెరుమాండ్లు (శ‌త్రు)స‌హాయం తీసుకుని రాజ‌మ‌హ‌లుకు నిప్పు పెట్టిస్తాడు న‌ర్స‌ప్ప (అశుతోష్ రాణా). అక్క‌డి నుంచి పెరుమాండ్లు, న‌ర్స‌ప్ప స‌న్నిహితంగా ఉంటారు. కొల్లాపూరు నుంచి న‌ల్ల‌మ‌ల వ‌ర‌కు అంతా న‌ర్స‌ప్ప క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతుంటుంది. అక్క‌డి పొలం మీద దున్నేవాడికి హ‌క్కుండ‌దు. భార్య‌ల మీద హ‌క్కుండ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో న‌ర్స‌ప్ప నుంచి ప‌క్క‌కు తొలుగుతాడు పెరుమాండ్లు. అదే స‌మ‌యంలో కొల్లాపూర్ ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డానికి వ‌స్తాడు న‌ర్స‌ప్ప త‌మ్ముడు శేఖ‌ర్‌బాబు (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌). అత‌ను అసీమా ఖాన్‌ను (నందితా శ్వేత‌) ఇష్ట‌ప‌డ‌తాడు. కొల్లాపూర్ నుంచి మ‌ల్లెల‌తీరం మీదుగా న‌దీమార్గంలో లాంచీల‌ను శ్రీశైలం వ‌ర‌కు న‌డ‌పాల‌ని అనుకుంటుంది అసీమా. ఆమెకు శేఖ‌ర్‌బాబు స‌పోర్ట్ చేస్తాడు. అంత‌లోనే అత‌న్ని ఎవ‌రో కాల్చి చంపేస్తారు. కొల్లాపూర్ లో జ‌రుగుతున్న క్రైమ్‌ను ఇన్వెస్టిగేష‌న్ చేయ‌డానికి రిపోర్ట‌ర్ (రాహుల్ రామ‌కృష్ణ‌) వ‌స్తాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఎ.క‌ల్కి ఐపీయ‌స్ (రాజ‌శేఖ‌ర్‌) కూడా అక్క‌డికి ఇన్వెస్టిగేష‌న్‌కు వ‌స్తాడు. వీరిద్ద‌రు చేసిన ఇన్వెస్టిగేష‌న్ ఏంటి? న‌ర్స‌ప్ప‌కు క‌ల్కికి మ‌ధ్య జ‌రిగిన డిస్క‌ష‌న్ ఏంటి? పెరుమాండ్ల‌కు క‌ల్కి సాయం చేశాడా? లేదా? మ‌ల్లెల‌తీరానికి రోజూ నీళ్ల కోసం వెళ్లిన స్వామీజీ క‌డుపులో దాచుకున్న ర‌హ‌స్యం ఏంటి? కొల్లాపూర్ మ‌హారాణి బ‌తికే ఉందా? ఉంటే ఎవ‌రు? డాక్ట‌ర్ ప‌ద్మ‌కు, ఐపీయ‌స్ క‌ల్కికి ఎక్క‌డ ప‌రిచ‌యం? ఆసిమాకు క‌ల్కి కి మ‌ధ్య ఉన్న‌ది రాధాకృష్ణుల బంధ‌మా? లేకుంటే ద్రౌపదీకృష్ణుల బంధ‌మా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.
విశ్లేషణ… విజయవంతమైన ‘గ‌రుడ‌వేగ‌’ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ – వైవిధ్య‌మైన `అ!` త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ కలిసి తెరకెక్కించిన చిత్ర‌మిది.సినిమా మొత్తం 80ల బ్యాక్‌డ్రాప్‌లో జ‌రుగుతున్న‌ట్టు చూపించారు. ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌లో స్క్రీన్‌ప్లే ప్ర‌ధానం. అయితే క‌థనం మెప్పించ‌దు. ఆసక్తి కలిగించలేని కథనం అనవసరంగా పక్క దారులు పట్టడం కూడా మైనస్ అయ్యింది.సైన్స్ లో ఉన్న లాజిక్కుల‌కు, క‌ర్మ‌కు లింకులు పెట్టే అంశాలు సామాన్యుల‌కు కొరుకుడు ప‌డ‌దు . వ‌ర్షంలో తీసిన ఫైటు, ఫారెస్ట్ ఫైట్ ఆక‌ట్టుకుంటాయి. పాట‌లు ఆక‌ట్టుకునేలా లేవు. స్పెష‌ల్ సాంగ్ కూడా స్పెష‌ల్‌గా అనిపించ‌దు.అర్థం లేని ఒక ఐటెమ్‌ సాంగ్‌ బూతు డాన్స్‌ మూవ్‌మెంట్స్‌తో ఎందుకోసం పెట్టారో అర్ధం కాదు.  రాజశేఖర్ ,ఆదా శర్మల మధ్య ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పాతకాలపు సినిమా ఫార్మాట్ లో సాగడంతో ప్రేక్షకుడు కొత్తదనం ఫీలవ్వడు. అసలు అవసరమే లేని ఈలవ్‌స్టోరీని ఎడిట్‌ చేయడంతో పాటు… స్లో మోషన్‌లో జరిగే యాక్షన్‌ సీన్స్‌, హీరో తాలూకు బిల్డప్‌ సీన్స్‌ అన్నీ రెగ్యులర్‌ స్పీడ్‌లో చూపించినట్టయితే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. ఇక మూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చివరి 30 నిమిషాలు… ఆసక్తి రేపే విధంగా ప్రేక్షకుడిని థ్రిల్ దర్శకుడు థ్రిల్ చేసాడు. సినిమాలోని అసలు ట్విస్ట్ ని రివీల్ చేసే సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి.
 
నటవర్గం… రాజ‌శేఖ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చేసిన సినిమాలు ఎప్పుడూ నిరాశ‌ప‌ర‌చ‌లేదు.ఆయ‌న తాజాగా `కల్కి`లోనూ ఖాకీ ఫార్ములానే న‌మ్ముకున్నారు. ఐపీయ‌స్ ఆఫీస‌ర్ క‌ల్కిగా ఇందులో న‌టించారు. ఆయ‌న ముఖంలో వార్ద‌క్యం ఛాయ‌లు కాసింత క‌నిపించినా.. స్టైల్ విష‌యంలోగానీ, హుషారుగా ఫైట్లు చేయ‌డంలోగానీ రాజ‌శేఖ‌ర్ చార్మ్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మంచు ప్ర‌దేశాల్లో డిప్యుటేష‌న్ మీద సీఆర్‌పీఎఫ్ జ‌వానుగా క‌నిపించే స‌న్నివేశాల్లోనూ ఆక‌ట్టుకున్నారు. ఆదా శ‌ర్మ కొన్ని యాంగిల్స్ లో బాగానే ఉన్నా, మ‌రికొన్ని సార్లు ఏజ్డ్ గా క‌నిపించింది.ఆదా శర్మ పాత్రని కుదిస్తే చాలా సమయం, డబ్బు ఆదా అయ్యేది. నందితా శ్వేత త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. ఆమెకి సినిమా చివర్లో ప్రాధాన్యత దక్కింది.రాజశేఖర్ కి సహాయం చేసే జర్నలిస్ట్ పాత్రలో రాహుల్ రామకృష్ణ నటన పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలకే పరిమితమైన పూజిత పొన్నాడ తన నటనతో అలరించింది. ప్రతినాయకుడి పాత్రలో అశుతోష్ రానా,సిద్దు జొన్నలగడ్డ ప్రధానమైన పాత్రలు పోషించారు.          
సాంకేతికంగా… పాటలతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శ్రావణ్ భరద్వాజ్‌ నేపథ‍్యం సంగీతంతో సినిమాకు ప్రధాన బలం అయ్యాడు. అయితే,కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సీన్‌ను డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. 80ల నాటి లుక్‌ తీసుకురావటంలో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్ చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది.నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి -రాజేష్