డా.రాజశేఖర్ ‘కల్కి’ టీజర్ కు విశేష స్పందన

పురాతన కట్టడాలు ఉన్నాయి… కోటలు, కొండలు ఉన్నాయి.
ముస్లిమ్ సోదర సోదరీమణులు ఉన్నారు… హిందూ స్వామీజీలు కూడా ఉన్నారు.
అడవులు ఉన్నాయి… కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు ఉన్నాయి.
బాంబులు ఉన్నాయి… బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగు తీసే మనుషులు ఉన్నారు.
గ్రామ పెద్దలు ఉన్నారు… గుమిగూడిన మనుషులు ఉన్నారు… నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి.
 
విపత్కర పరిస్థితుల నడుమ… వివిధ వర్గాల ప్రజల మధ్య ‘కల్కి’ కదిలాడు. కదనరంగంలో గొడ్డలి పట్టి దిగాడు. అతడి కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి.
 
‘యాంగ్రీ స్టార్’ రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సినిమా టీజర్ బుధవారం ఉదయం 10.10 గంటల 10 సెకన్లకు టీజర్ విడుదల చేశారు. 1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. విజువల్స్, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు బావున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు.
 
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “రాజశేఖర్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. సీన్ బాగా రావడం కోసం ఆయన ఎన్ని టేక్స్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. నేను ఇప్పటివరకూ పని చేసిన యాక్టర్స్ లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ రాజశేఖర్ గారు. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ శాంపిల్ మాత్రమే. ట్రైలర్ ఇంకా క్రేజీగా ఉంటుంది. త్వరలో విడుదలవుతుంది. ప్రేక్షకుల అంచనాలను సినిమా చేరుకుంటుంది. నేను దర్శకత్వం వహించిన ‘అ!’ ప్రయోగాత్మక సినిమా. ‘కల్కి’ పక్కా కమర్షియల్ సినిమా. ఇదొక కొత్త కథ. కథను చెప్పే విధానం కూడా కొత్తగా ఉంటుంది” అన్నారు.
 
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ “టీజర్ కు వస్తున్న స్పందన వింటుంటే చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో చిత్రబృందం బిజీగా ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అన్నారు.
 
అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.
 
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ – సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ