బేసిగ్గా ఆర్టిస్ట్‌ను కాబట్టి ఇంట్లో కూర్చోలేకపోయేవాడ్ని !

మూడు దశాబ్దాలుకు పైగా సినీ, రాజకీయ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు డా. శివప్రసాద్‌. డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ.. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్‌ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించుకున్నారు. రీసెంట్‌గా ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చిత్రంలో జడ్జి క్యారెక్టర్‌లో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను తెలిపారు….
 ‘‘కాలేజ్‌లో జాబ్ చేస్తున్న టైమ్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి డైరెక్టర్‌గా వ్యవహరించిన నేను నా గ్రూప్‌తో స్టేట్ అంతా తిరిగివచ్చాను. అవి జరుగుతున్న టైమ్‌లో మధ్యాహ్నం నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒకతను వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఎదురుగా ఒక వ్యక్తి వున్నాడు. ‘ఐ యామ్‌ భారతీరాజా. ఐ వాంట్‌ టూ స్పీక్‌ డా. శివప్రసాద్‌’ అన్నాడు. తమిళ్‌లో భారతీరాజా అప్పటికే చాలా పెద్ద ఫేమస్‌ డైరెక్టర్‌. మేం ఇద్దరం కలిసి ఒక హోటల్‌లో కూర్చుని మాట్లాడుకున్నాం. ఆయన ఒక కొత్త హీరోయిన్‌ని పెట్టి తెలుగులో సినిమా తీస్తున్నారు. ప్రతిసారి ఒక కొత్త హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నాను. ఈసారి తెలుగులో చెయ్యాలి. తెలుగులో అమ్మాయిని ఇంట్రడ్యూస్‌ చెయ్యాలనుకుంటున్నాను అన్నారు. మీ దగ్గర కాలేజెస్‌, యూనివర్శిటీస్‌ ఎక్కువగా వున్నాయి కాబట్టి వచ్చాను అన్నారు ఆయన. నా గురించి ఎవరో చెబితే అలా నా దగ్గరకి వచ్చారు. ఆ రోజుల్లో అమ్మాయిలు ఒప్పుకున్నా పేరెంట్స్‌ ఒప్పుకోకపోవడం, పేరెంట్స్‌ ఒప్పుకుంటే అమ్మాయిలు ఒప్పుకునేవారు కాదు.
ఆయనకి ఎవరూ దొరక్కపోవడంతో ఆ సినిమాకి సుహాసిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ‘పుదై వాళ్‌కైగళ్‌’ తమిళ్‌లో, తెలుగులో ‘కొత్త జీవితాలు’గా చేశారు. అది నా ఫస్ట్‌ ఫిలిం. నూతనప్రసాద్‌గారి కాంబినేషన్‌లో ఆ సినిమా చేశాను. అప్పటికే నేను డాక్టర్‌గా, నా మిసెస్‌ గైనకాలజిస్ట్‌గా చాలా ఫేమస్‌గా వున్నాం. తమిళంలో షూటింగ్‌ వాతావరణం చూసి భయపడిపోయి సినిమాలు ఇంక మనకి వద్దు అనుకున్నాను.
మా ఇంట్లో ఘర్షణ స్టార్ట్‌ అయ్యింది !
నూతనప్రసాద్‌గారు ‘ఓ అమ్మ కథ’ సినిమా తీస్తున్నారు. ఇదొక్కటి చేసి మానెయ్యండి అన్నారు. సరేనని ఆ సినిమా చేశాను. అది ఫినిష్‌ అవగానే మా సీనియర్‌ డాక్టర్‌ తిరుపతిరెడ్డి వచ్చి నేను ‘ఖైదీ’ అనే సినిమా చిరంజీవితో తీస్తున్నాను. ఆ సినిమా ఒక్కటి చేసి మానేయ్‌ అన్నాడాయన. ఆ సినిమా చేసిన రెండు రోజుల్లో నాకు 17 సినిమాలు ఆఫర్స్‌ వచ్చాయి. మా ఇంట్లో ఘర్షణ స్టార్ట్‌ అయ్యింది. సినిమాలు వద్దు అంటున్నారు. ఒకరోజు మా కాలేజ్‌కి వెళ్ళాం. అక్కడ జాబ్‌ చేస్తున్నాను. ప్రిన్సిపాల్‌ని కలిసి 17 సినిమాలు ఆఫర్‌ వచ్చాయి సార్‌ చేయమంటారా? వద్దంటారా! మీ ఇష్టం సార్‌. ఒక సలహా చెప్పండి అని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. సినిమాల్లో వేషం వచ్చేది చాలా కష్టం. అలాంటిది నువ్‌ ప్రయత్నం చేయకుండానే నీకు అదృష్టం కలిసొచ్చింది. సినిమాలు చేయి అన్నారు. వారి సహకారంతో ఐదు సంవత్సరాల్లో 56 సినిమాలు చేశాను…’’ అన్నారు.
 ‘‘ఎందుకో కామెడీకి అప్పట్లో అంత ప్రాధాన్యత వుండేది కాదు. కానీ ‘ఖైదీ’లో కోదండరామిరెడ్డిగారు నాకు, సుత్తివేలుకి ఫ్రీడం ఇచ్చారు. సీన్లు చెప్పి ‘కంటెంట్‌ ఇది. మీరు ఏమి డెవలప్‌ చేసుకుని చేస్తారో చేయండి’ అన్నారు. పాటలు, కామెడీ బిట్స్‌ మేం ఓన్‌గా చెప్పాం. అవన్నీ బాగా సక్సెస్‌ అయ్యాయి. తర్వాత కొంతమంది కామెడీని పెద్దగా ఉపయోగించుకునేవారు కాదు. పది సినిమాలు చేస్తే అందులో రెండు సక్సెస్‌ అయ్యేవి. నాకు శాటిస్‌ఫ్యాక్షన్‌ అయ్యేది కాదు. ఉన్న సినిమాలు కంప్లీట్‌ చేసి సినిమాలు మానేశాను. మళ్ళీ నా కాలేజ్ జాబ్‌లోకి చేరిపోయాను.
శ్రీలత ను రోజాగా మార్చి పరిచయం చేశాం !
శివప్రసాద్‌  తన పాత్రల గురించి చెబుతూనే.. ఇప్పుడు నటిగా, వైసీపీ నాయకురాలిగా దూసుకుపోతున్న రోజా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు….
బేసిగ్గా ఆర్టిస్ట్‌ను కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోయేవాడ్ని. ప్రతి సంవత్సరానికి రెండు సినిమాలు డైరెక్ట్‌ చెయ్యాలి అని డిసైడ్‌ అయ్యాను. 1991లో ‘ప్రేమతపస్సు’ సినిమా స్టార్ట్‌ చేశాం. ఒక కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్‌ చెయ్యాలని చాలా చోట్ల ఆరు నెలల పాటు తిరిగాం. ఫైనల్‌గా శ్రీలత అనే అమ్మాయిని రోజాగా మార్చి ఆ చిత్రంతో ఇంట్రడ్యూస్‌ చేశాం. రోజాకి ట్రైనింగ్‌ ఇచ్చి అన్నీ పర్‌ఫెక్ట్‌గా నేర్పించాం. నిర్మాత పోకూరి బాబూరావుని విలన్‌గా పరిచయం చేశాం. ఒక బాధ్యత తీసుకుని రోజాని హీరోయిన్‌గా అందరికీ చూపించాం.
రామానాయుడుగారు నాకు ఫోన్‌ చేశారు. గోపాలకృష్ణ చూస్తాడు.. ఒకసారి హీరోయిన్‌ సాంగ్స్‌, సీన్స్‌ చూపించమని అన్నారు. నేను ఆటోలో కాన్లు పెట్టుకుని స్వయంగా వెళ్లి చూపించాను. గోపాలకృష్ణగారు చూసి ఒక సినిమాలో రోజాని హీరోయన్‌గా బుక్‌ చేశారు. మా అల్లుడు వేణు నా దగ్గర వుండేవాడు. సెల్వమణి వచ్చి మా వేణుని కలిసి సాంగ్స్‌, సీన్స్‌ చూశాడు. రెండు ప్రాజెక్ట్‌లు వచ్చాయి. జాగ్రత్తగా నువ్‌ చేసుకో అని రోజాకి చెప్పాను. ఆరు నెలలు స్క్రిప్ట్‌ చేసుకుని, ఆరు నెలలు సినిమా చేసుకుంటూ వుండిపోయాను…’’ అని తెలిపారు.