కోట్లాది మంది ఫాలోయర్స్ తో కోట్లు డిమాండ్ !

సోషల్‌మీడియాలో పెట్టే ఒక్కో పోస్ట్‌కి  రూ.7 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు ప్రముఖ హాలీవుడ్‌ నటుడు డ్వెయిన్‌ జాన్సన్‌ (ది రాక్‌). అతనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకు ఆయన సినిమాలు రాబట్టే వసూళ్లే నిదర్శనం. సోషల్‌మీడియాలోనూ కోట్లాది మంది డ్వెయిన్‌ను అనుసరిస్తున్నారు. తనకున్న క్రేజ్‌కు తగ్గట్టుగానే డ్వెయిన్‌ పారితోషికం తీసుకుంటారు.
 
ఆయన నటించే సినిమాలను సోషల్‌మీడియాలో ప్రచారం చేయడానికి డ్వెయిన్‌ తీసుకునే పారితోషికం మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు). ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెడితే అతనికి రూ.7 కోట్లు వస్తాయట. ప్రస్తుతం డ్వెయిన్‌ ‘రెడ్‌ నోటిస్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఈ సినిమాకు సంబంధించి సోషల్‌మీడియాలో పెట్టే ఒక్కో పోస్ట్‌కి డ్వెయిన్‌ రూ.7 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.
 
220 మిలియన్‌ డాలర్ల సంపన్నుడైన డ్వెయిన్‌ ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచంలో పేరుమోసిన సూపర్‌స్టార్లలో డ్వెయిన్‌ ఒకరు. ఆయన దేహదారుఢ్యాన్ని చూసి అభిమానులు ‘రాక్’ అని పిలుస్తుంటారు. ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా రాణించిన డ్వెయిన్‌ సినీ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎన్నో  విజయవంతమైన యాక్షన్ ప్రధాన చిత్రాల్లో నటించారు. అంతటి గొప్పస్టార్‌తో నటించే అవకాశం మన భారతీయ నటి ప్రియాంక చోప్రాకు దక్కింది. ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’లో డ్వెయిన్‌ ప్రధాన పాత్రలో నటించారు.