సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న450 కోట్ల భారీబడ్జేట్ చిత్రం 2.ఓ. వీరి కాంబినేషన్‌లో ఘనవిజయం సాధించిన ‘రోబో’ సినిమాకు సీక్వల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాను ముందుగా 2018 జనవరిలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్ ను ఏప్రిల్‌కు వాయిదా వేశారు.
అయితే 2.ఓ మరోసారి వాయిదా పడింది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉన్నాయట. ఈ గ్రాఫిక్స్ కోసం ఎన్నో దేశాల్లో పని జరుగుతున్నా అనుకున్న సమయానికి పని పూర్తవుతుందో లేదో అన్న అనుమానం వ్యక్తమవుతుంది. దీంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. ఏకంగా ఆగస్టు మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా.. చిత్రయూనిట్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
అందుకే టీజర్, ట్రైలర్స్ విడుదల చేయలేదు !
‘రోబో’ తర్వాత శంకర్, రజనీ కాంబినేషన్‌లో వస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘2.0’. అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తుండగా, అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మొదట జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. వాయిదా వేసి ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా మరోసారి సినిమా విడుదలను వాయిదా వేసారు. అందుకు కారణం సీజీ, వీఎఫ్‌ఎక్స్ ఆలస్యమవడమే. ఈ చిత్ర వీఎఫ్‌ఎక్స్ పనులను అమెరికాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ దివాలా తీయడంతోపాటు ఇప్పటి వరకు చేసిన సీజీ వర్క్ విషయంలో కూడా దర్శకుడు శంకర్ సంతృప్తిగా లేరట.
దీంతో త్రీడీ ఎఫెక్ట్స్‌తో సహా మొత్తం వీఎఫ్‌ఎక్స్ పనులు మళ్ళీ మొదట్నుంచి ప్రారంభించాలనే యోచనలో శంకర్ ఉన్నారట. దీంతో ఓ కొత్త సంస్థకు ఈ సీజీ పనులను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ కూడా విడుదల చేయలేదు. అన్ని పనులు పూర్తి చేసిన తర్వాతే టీజర్, ట్రైలర్‌తో సహా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారట. రెహ్మాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఇటీవల దుబాయ్ లో భారీ స్థాయి లో విడుదల చేసారు. ‘2.0’ వాయిదా పడుతున్న నేపథ్యంలో రజనీకాంత్ నటించిన మరో చిత్రం ‘కాలా’ను తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 27 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘కబాలి’ వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన పా.రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.