ప్రముఖ రచయిత వెన్నెలకంటి ఇక లేరు !

ప్రముఖ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం మరణించారు.తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. బ్యాంకు ఉద్యోగిగాను ఆయన పని చేశారు. ఆయనకు ఇద్దరు తనయులు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి. అతను కూడా సినీ రచయిత. రెండవ తనయుడు రాకెందు మౌళి. కాగా డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్‌గా వెన్నెలకంటికి మంచి పేరు ఉంది. తమిళ సినిమాలకు కూడా పాటలు అందించారు.

ఆధ్యాత్మిక ప్రసంగాలు, హరి కథలు వినడాన్ని ఆయన బాగా ఇష్ట పడేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూరాశారు. 1986లో భాస్కర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన ‘శ్రీరామ చంద్రుడు’ సినిమాతో గీత రచయితగా వెన్నెలకంటి ప్రస్థానం మొదలైంది. వెన్నెలకంటి తండ్రి ‘ప్రతిభా’ కోటేశ్వరరావుకూ సినీ అనుబంధం ఉంది. ఎస్పీబీ ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1500కు పైగా స్ట్రెయిట్‌ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు.

వెన్నెలకంటి పాటల్లో చెప్పుకోదగ్గవి !

అద్భుతమైన సినీ గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ కలం నుంచి ఎన్నో వందల పాటలు వచ్చాయి. 1986లో ‘శ్రీరామచంద్రుడు’ నుంచి నిన్నమొన్నటి కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ వరకు ఎన్నో వందల పాటలు రాసారు వెన్నెలకంటి. వెన్నెలకంటి కలం నుంచి ఎన్నో అద్భుతమైన గీతాలు వచ్చాయి. ఈయన కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే పాటలు కొన్ని ఉన్నాయి. నాగార్జున, బాలయ్య, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్ర కథానాయకులందరికీ పాటలు రాసారు వెన్నెలకంటి. ఆయన రాసిన  పాటల్లో  చెప్పుకోదగ్గవాటిని  చూద్దాం..

1. మాటరాని మౌనమిది: వంశీ తెరకెక్కించిన మహర్షి చిత్రంలోని మాటరాని మౌనమిది పాట వెన్నెలకంటి కెరీర్‌కు ప్రాణం పోసింది.

2. మధురమీ సుధాగానం: రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ జంటగా నటించిన బృందావనం సినిమాలోని ఈ పాట అయితే ఇప్పటికీ ఎప్పటికీ అద్భుతమే.

3. రాసలీల వేళ: ఆదిత్య 369 సినిమాలోని రాసలీల వేళ పాట ఈ రోజుకు కూడా నిత్యనూతనమే.

4. చల్తీ కా నామ్ గాడీ: పదప్రయోగం చేయడంలో వెన్నెలకంటి ఎప్పుడూ ముందుంటారు. చెట్టు కింద ప్లీడర్ సినిమాలోని చల్తీ కా నామ్ గాడీ పాట కూడా బాగానే హిట్ అయింది.

5. మాటంటే మాటేనంట: ఏప్రిల్ 1 విడుదల సినిమాలో ఈ పాటను ముందు మరో సిరివెన్నెలతో రాయించాలనుకున్నా కూడా చివరికి వెన్నెలకంటి కలం నుంచి వచ్చింది.

6. భీమవరం బుల్లోడా: ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడా పాటను ఇప్పటికీ ఎవరైనా మరిచిపోగలరా.. ఆ రేంజ్ హిట్ అయింది ఈ పాట.

7. కొండా కోనల్లో లోయల్లో: స్వాతి కిరణం సినిమాలోని 11 పాటలను అప్పటికే వేటూరి, సిరివెన్నెల పూర్తి చేసారు. మిగిలిన ఒక్కపాటను విశ్వనాథ్ ఈయనతో రాయించాడు.

8. సన్నజాజి పడక: డబ్బింగ్ పాటలు రాయడంలో వెన్నెలకంటి సిద్ధహస్తుడు. క్షత్రియ పుత్రుడు సినిమాలోని సన్నజాజి పడక పాటే దీనికి నిదర్శనం.

9. రావయ్య ముద్దులమామ: సమరసింహారెడ్డి సినిమాలోని రావయ్య ముద్దులమావ పాటకు నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

10. ప్రేమంటే ఏమిటంటే: శీను సినిమాలోని ప్రేమంటే ఏమిటంటే పాటలోని లిరిక్స్ చూస్తే వెన్నెలకంటి సాహిత్యం విలువ తెలుస్తుంది.

11. హృదయం ఎక్కడున్నది: డబ్బింగ్ పాటల్లోని పాటలు కూడా ఈ స్థాయిలో విజయం సాధిస్తాయా అని గజిని సినిమాలోని ఈ పాట తెలుపుతుంది.

12. కొంతకాలం కొంతకాలం: రజినీకాంత్‌కు ఎన్నో పాటలు రాసాడు వెన్నెలకంటి. ఆ తర్వాత చంద్రముఖి సినిమాలో కొంతకాలం కొంతకాలం పాట ఎంతకాలమైనా నిలిచిపోతుంది.