పాత.. కొత్తతరం జర్నలిస్టుల వేదిక ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

“మా” అసోసియేషన్ భాధ్యతలు చేపట్టిన తర్వాత.. పదవులు ఎంత బాధ్యతగా నిర్వహించాలో అర్థమైందన్నారు- డా.రాజశేఖర్. ‘ఫిలిం క్రిటిక్స్అసోసియేషన్’ సమావేశానికి హాజరయిన డా.రాజశేఖర్ మాట్లాడుతూ… “పదవులు అలంకారం కోసం కాదన్నారు. చిన్న అసోసియేషన్ల విషయమే ఇలా ఉంటే.. రాష్ట్రాలను పాలించేవారి పరిస్థితి అర్థం అవుతుందన్నారు
 
“మా” ప్రధాన కార్యదర్శి జీవిత మాట్లాడుతూ… తన‘తలంబ్రాలు’ సినిమాకు రివ్యూ రాసిన గుడిపూడి శ్రీహరిగారిని చూడటం … పాతతరం జర్నలిస్టులు ..నేటి తరం జర్నలిస్టులను ఒకే వేదికపై చూడటం చాలా ఆనందం వేసిందన్నారు.ఈ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సహాయసహకారాలు అందిస్తామన్నారు .
 
దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ.. వ్యక్తులుగా కన్నా.. వ్యవస్థగా పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. అసోసియేషన్లు అందుకు తోడ్పడతాయన్నారు. సభ్యులకు ఇన్సూరెన్స్, ఇతర సదుపాయాల కల్పనలో చాలా సమస్యలు ఎదురవుతాయని, కమిటీ వేసి నిర్వహిస్తే.. నిధులు దుర్వినియోగం కావన్నారు. అందరూ ఏకతాటిపై నడిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.
 
‘ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ.జనార్దన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరిల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. పాత, కొత్త సభ్యులందరికీ రాజశేఖర్, జీవిత, శంకర్ ల చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు.
 
అధ్యక్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ అసోసియేషన్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 14న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని .. దీని కోసం వివిధ కమిటీలను ప్రకటించారు. ఈ వేడుకల్లో సినీరంగ ప్రముఖులను సత్కరించనున్నట్లు చెప్పారు.
 
ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ..సభ్యులకు ఆరోగ్యభీమా కల్పన, అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో గోల్డెన్ జూబ్లీ కమిటీ చైర్మన్ బి.ఎ.రాజు, ‘ఎఫ్.సి.ఎ’ ఉపాధ్యక్షులు డి.జి. భవాని, సజ్జా వాసు, జాయింట్ సెక్రటరీ మాడూరి మధు, ట్రెజరర్ భూషణ్, కార్యవర్గ సభ్యులు సాయిరమేష్, హేమసుందర్, మురళీ కృష్ణ, సునీతా చౌదరి, ముత్యాల సత్యనారాయణ, చిన్నమూల రమేష్, ఆర్డీఎస్ ప్రకాష్, జిల్లా సురేష్ తో పాటు పాత, కొత్త సభ్యులు హాజరయ్యారు.