సినిమాల తర్వాత నా జీవితం ఈ వ్యాపారంతోనే !

ఎమీ సోయగాలకు  తమిళ సినీ ప్రేక్షకులు ఫ్లాట్ అయిపోయారు. ‘మదరాసు పట్టణం’ చిత్రంతో వారి మదిని దోచింది ఈ బ్యూటీ. ఆతర్వాత ఒకటి, రెండు చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోయినా ఈ ఇంగ్లీష్ బ్యూటీకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ఎక్కడో ఇంగ్లాండ్‌లో పుట్టి ఇండియాలో గ్లామరస్ తారగా రాణించడమన్నది ఎమీజాక్సన్ ఎప్పుడూ ఊహించి ఉండదు.  శంకర్ ‘ఐ’ చిత్రం ఎమీజాక్సన్‌కు ఎంతో క్రేజ్‌ను తెచ్చింది. ఈ చిత్రం అందరినీ సంతృప్తిపరచలేకపోయినా ఎమీ ఆరబోసిన అందాలు యువకుల మతులు పోగొట్టాయి. ఆతర్వాత కోలీవుడ్‌లో ధనుష్, ఉదయనిధి స్టాలిన్‌తో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. విజయ్‌కు జంటగా ‘తెరి’ చిత్రంలో నటించి గ్లామరస్ తారగా దూసుకుపోయింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలా తక్కువ కాలంలోనే చాలా మంది టాప్ హీరోయిన్లకు దక్కని సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే లక్కీ ఆఫర్‌ను ‘2.0’ చిత్రంతో దక్కించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. మరోపక్క మాతృభాష ఇంగ్లీష్ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని ఈ భామ అందుకుందట. ఇలా నాయకిగా పలు భాషల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నా మరో రకం  వ్యాపారానికి కూడా సిద్ధమైంది ఈ బ్యూటీ. లండన్‌లో తన స్నేహితుడితో కలిసి ఒక అధునాతన సౌందర్య ఉపకరణాల షాపును ప్రారంభించాలని నిర్ణయించుకుందట. దీని గురించి ఎమీజాక్సన్ మాట్లాడుతూ… ఆధునిక అలంకరణ ఉత్పత్తులతో కూడిన షాపుతో పాటు అధునాతన వసతులతో బ్యూటీ సెలూన్‌ను కూడా ప్రారంభిస్తానని చెప్పింది. ఇక సినిమాల తర్వాత తన జీవితం ఈ వ్యాపారంతోనే కొనసాగుతుందని ఎమీజాక్సన్ స్పష్టంచేసింది.