ఆడంబర జీవితమే తప్ప, ఆనందం లేదు !

“మామూలు అమ్మాయిలను చూస్తుంటే తాను కూడా వారిలా ఉండలేకపోయానన్న బాధ కలుగుతుందని అందాల తార తమన్నా అంటోంది.  సినిమా తారల జీవితాలు సుఖంగా సాగుతాయని చాలా మంది అనుకుంటూ ఉంటారని, కానీ ఇక్కడ సుఖ జీవనం అన్నది అపోహేనని, తమ జీవితాలు సమస్యలమయమని చాలా మందికి తెలియద”ని తమన్నా అభిప్రాయపడింది.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ… “తమకు లభించేది ఆడంబరాలతో కూడిన జీవితమే తప్ప ఆనందం ఉండదని అంటోంది. హీరోయిన్లు ఎవరూ సంపూర్ణంగా సంతోషాన్ని అనుభవించడం లేదని, రాత్రింబవళ్లూ షూటింగ్ ల్లో పాల్గొంటూ శ్రమిస్తుంటామని చెప్పింది. స్పాట్ లో ‘రెడీ’ అని వినబడగానే వెళ్లి నిలుచోవాలని, మనసులో ఎన్ని కష్టాలున్నా ముఖంపై కనిపించకుండా చూసుకోవాలని, సొంత పనులకు, సొంత మనుషులకు సమయాన్ని కేటాయించాలని ఉన్నా అది కుదరదని వాపోయింది. కనీసం నచ్చిన తిండి కూడా తినలేని పరిస్థితుల్లో తామున్నామని తమన్నా వెల్లడించింది. మామూలు అమ్మాయిలను చూస్తుంటే తాను కూడా వారిలా ఉండలేకపోయానన్న బాధ కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం పరితపించాల్సి వుంటుందని, దర్శకుడు చెప్పినట్టు నడచుకోవాల్సిందేనని, అందుకే ‘తారల జీవితం అద్దాల మేడని పెద్దలు’ అంటుంటార”ని వేదాంతాలు వల్లించింది.

బాలీవుడ్‌లో డైనోసార్స్ సినిమాలో …

తమన్నా తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ‘బాహుబలి’ సినిమాను మినహాయిస్తే ఏ చిత్రంలోని పాత్ర కూడా ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. అయితే అందంలో తమన్నా మంచి మార్కులే కొట్టేసిందని చెప్పుకోవచ్చు. ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడిచేసి ప్రేక్షకులను అలరించింది. ఇక అసలు విషయానికొస్తే …తమన్నా తాజాగా బాలీవుడ్‌లో ఓ బిగ్ ఆఫర్‌ను దక్కించుకుందట. డైనోసార్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో తమన్నా కీలకమైన పాత్రలో కనిపించనుండగా… అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ దీనికి సంగీతాన్ని అందిస్తాడు. ‘బాహుబలి’ కంటే భారీ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. సౌత్‌లో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అమ్మడు బాలీవుడ్‌లో ఏకంగా డైనోసార్స్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతుండటం విశేషం. ప్రస్తుతం తమన్నా హీరో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా ‘నా నువ్వే’ సినిమాతో పాటు సందీప్‌కిషన్‌తో కలిసి మరో సినిమాలో నటిస్తోంది.