సినిమా శిక్షణా సంస్థలు భారత్ లో మరిన్ని రావాలి !

గోవా, నవంబర్ 24 : సినిమా రంగంలో సరైన శిక్షణ ఇవ్వడానికి భారతదేశంలో మరిన్ని సంస్థలు ఏర్పడాల్సి ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సినిమాలు నిర్మించడానికి శిక్షణ అవసరమా అనే అంశంపై జరిగిన ఓపెన్ ఫోరంలో ఫుణె ఫిలిం ఇనిస్టిట్యూట్ డీన్ అమిత్ త్యాగి, ఆస్ట్రేలియా దర్శక నిర్మాత అనా తివారీ, ఎన్ ఎఫ్ డి సి అధికారి విక్రమ్ జిత్ తదితరులు చర్చలో పాల్గొన్నారు.
అమిత్ త్యాగి మాట్లాడుతూ… మనదేశంలో 30 ఏళ్ళ వయసులోపు ఉన్నవారు సుమారు 6 కోట్ల మంది ఉన్నారని, అందులో సినిమారంగంపట్ల ఎంతో మంది ఓత్సాహికులు ఉంటారని అన్నారు. అయితే పుణె సంస్థ మాత్రం ప్రతి సంవత్సరం 110 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వగలదని చెప్పారు. ఆడియోరంగంలో కూడా పనిచేయాలనుకుంటున్న వారికి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
అనా తివారి మాట్లాడుతూ… సినిమా గురించి వేగంగా నేర్చుకోవడానికి శిక్షణా సంస్థలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. పదేళ్ళ నుంచి ఆస్ట్రేలియాలో ఉంటునన తివారీ, అక్కడే ఓ యూనివర్శిటీ నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిల్మ్ స్కాలర్ సుఖ్ ప్రీత్ మాట్లాడుతూ సినిమారంగంలోకి రావడానికి ప్రాథమిక విద్య, సినిమా గ్రామర్ తెలిసుంటు బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న సినిమా ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఇప్పటి తరాలతో పాటు భావితరాలకు కూడా తెలియాల్సి ఉందన్నారు.
న్యూయార్క్ జర్నలిస్టు సమంత సంతోరి మాట్లాడుతూ… దర్శకుడితో పాటు సినిమాటోగ్రఫర్ కు కూడా కనీస అధ్యయనం అవసరమని, అప్పుడే మంచి సినిమాలు వస్తాయని చెప్పారు. ఫిల్మ్ మేకర్ శశాంక్ భోస్లే మాట్లాడుతూ కేవలం యూట్యూబ్ ను ఆధారం చేసుకొని తాను ఎలా ఫిల్మ్ మేకర్ గా ఎదిగారో చెప్పారు. వర్క్ షాపులు నిరంతరం నిర్వహించడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందని, ప్రభుత్వ సంస్థలు ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సామాన్య ప్రజలకు సినిమారంగంలో అత్యుత్తమ శిక్షణను అందించడానికి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మెకానిజమ్ లేదని, అది వస్తే అందరికీ సినిమా శిక్షణ అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ఫిల్మ్ ఫెడరేషన్ సొసైటీస్ ఆఫ్ ఇండియా శశిధరన్ అధ్యక్షత వహించగా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సెక్రటరీ బిహెచ్ ఎస్ ఎస్ ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు జికె శ్యామ్, సభ్యులు మహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
       -గోవా నుంచి హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సెక్రటరీ బిహెచ్ ఎస్ ఎస్ ప్రకాష్ రెడ్డి, 9110301476