చతికిలబడ్డాడు… ‘చాణక్య’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2/5

ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… రామ‌కృష్ణ అలియాస్ అర్జున్‌(గోపీచంద్‌) రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఏజెంట్ . త‌న స్నేహితుల‌తో క‌లిసి సీక్రెట్ ఆప‌రేష‌న్స్ చేస్తుంటాడు.రా ర‌హ‌స్యాలు తెలిసిన ఓ టెర్రిరిస్ట్‌ను ఓసారి స్నేహితులతో కలిసి ప‌ట్టుకుని చంపేస్తాడు. అయితే టెర్ర‌రిస్ట్ నాయ‌కుడు ఖురేషి(రాజేష్ క‌తార్‌) ఇండియాను ప్ర‌పంచ దేశాల ముందు దోషిగా నిల‌బెట్ట‌డానికి ఓ ప్లాన్ వేస్తాడు. అర్జున్ స్నేహితుల‌ను కిడ్నాప్ చేసి పాకిస్థాన్‌లో క‌రాచీకి తీసుకెళ్లిపోతాడు. ‘ద‌మ్ముంటే స్నేహితుల‌ను కాపాడుకోమ‌’ని అర్జున్‌కి ఛాలెంజ్ విసురుతాడు. అప్పుడు అర్జున్ ఏం చేస్తాడు? త‌న స్నేహితుల‌ను ఎలా కాపాడుకుంటాడు? అస‌లు సోహైల్ ఎవ‌రు? దేశానికి ఎదురైన స‌మ‌స్య‌ను అర్జున్ ఎలా ప‌రిష్క‌రించాడో …తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ… దర్శకుడు తిరు రా ఏజెంట్ కథను చెప్పడంలో … ఒక సగటు స్పై థ్రిల్లర్‌కి తగ్గ స్క్రీన్‌ప్లే రాసుకోలేకపోయాడు.రొటీన్ కథకు అంతకన్నా రొటీన్ స్క్రీన్ ప్లే చేయటంతో పాటు ..లాజిక్ అసలు ఫాలో కాలేదు. ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ని అతని సొంత దేశం పాకిస్తాన్ లో ఎదుర్కోవడమంటే సాధారణ విషయం కాదు. అలాంటి సాహసం చేసిన హీరో వేసే ఎత్తులు కొంచెం లాజికల్ గా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సాగాలి. కానీ చాణక్య మూవీలో తిరు ఆ ఆసక్తిని కలిగించలేకపోయాడు. ఒక స్పై మిషన్ స్టోరీని చాలా సాదా సీదా సన్నివేశాలతో తెరకెక్కించి నీరసం కలిగించాడు ..యాక్షన్‌ సన్నివేశాలలో కూడా థ్రిల్‌ లోపించింది. ముఖ్యంగా హీరోకు తగ్గ విలన్ కథలో లేడు.స్పైగా ఫరవాలేదు కానీ.. ఆ మధ్యలో వచ్చే రొమాంటిక్ ట్రాక్, కామెడీ సీన్స్ బోర్ కొట్టిస్తాయి. ఫస్టాఫ్ ‘ఓకే’ అన్నట్లు గా సినిమా నడిచింది . ఉన్నంతలో ఇంట్రెవల్ కాస్త ఇంట్రస్టింగ్ గా ఉంది. క్లైమాక్స్ చివ‌రి పావుగంట బాగానే ఉంది.
నటీనటులు… గోపీచంద్ బ్యాంక్ ఉద్యోగి గా..రా ఏజెంట్ గా.. రెండు షేడ్స్‌లో న‌టించాడు.ఈ రెండింటిలో రా ఏజెంట్ రోల్‌ లో బాగున్నాడు . యాక్ష‌న్ పార్ట్‌లో త‌న‌దైన స్టైల్లో మెప్పించాడు. మెహ‌రీన్ పాత్రకు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. దాదాపు పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితమయ్యే పాత్ర . ఇక క‌మెడియ‌న్ సునీల్ పాత్ర‌కు కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. మ‌రో హీరోయిన్ జ‌రీనాఖాన్ సెకండాఫ్‌లో రా ఏజెంట్‌గా క‌న‌బడింది. మెహ‌రీన్ కంటే ఈ పాత్ర‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఉన్నా… ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఘోరం. ఇక ర‌ఘుబాబు, రాజా, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ ఇతర పాత్ర‌లలో క‌న‌ప‌డ‌తారు.
 
సాంకేతికంగా… వెట్రి సినిమాటో గ్రఫీ ఈ సినిమాకు హైలైట్.చాలా బాగా చేసాడు .ముఖ్యంగా పాకిస్తాన్ లో సాగే సీన్స్ లో కెమెరా వర్క్ బాగుంది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలలో… స్పై ఆపరేషన్స్ లో ఆయన కెమెరా పనితనం బాగుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌ పాటలు ఏమాత్రం అనుభూతి కలిగించవు. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌ సంగీతంలో నేపధ్య సంగీతం  కొంత మేర ఆకట్టుకుంది.అబ్బూరి రవి రాసిన కొన్ని డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి – రాజేష్