పాత చింతకాయ పచ్చడి … ‘గౌతమ్ నంద’ చిత్ర సమీక్ష

                                      సినీవినోదం రేటింగ్ : 2/5

శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకం పై సంపత్‌ నంది దర్శకత్వం లో జె.భగవాన్‌, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు .

ఘట్టమనేని గౌతమ్ (గోపిచంద్), ఫోర్బ్స్ లిస్ట్ లో స్థానం సంపాదించిన తెలుగు బిలియనీర్ విష్ణు ప్రసాద్ ఘట్టమనేని( సచిన్ కేడ్కర్) వారసుడు. ఆకలి, కష్టం, బాధ, కన్నీళ్ల తో పాటు ప్రేమ అంటే కూడా తెలియకుండా పెరిగిన కుర్రాడు. ఎప్పుడు పార్టీలు పబ్ లు అంటూ తిరిగే గౌతమ్ కు ఒక సంఘటన మూలంగా… విష్ణు ప్రసాద్ కొడుకుగా కాక తనకంటూ ఉన్న గుర్తింపు ఏంటి? అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఆ ఆలోచనలోనే గమ్యం తెలియకుండా ప్రయాణిస్తున్న గౌతమ్ కు, అచ్చు గుద్దినట్టు తనలాగే ఉండే మరో వ్యక్తి నంద కిశోర్ ఎదురుపడతాడు.డబ్బు తప్ప వేరే ఏ ఎమోషన్ తెలియని గౌతమ్, డబ్బుంటే చాలు ఏదైనా చేసేయ్యెచ్చు అనే నంద… తమ స్థానాలు మార్చుకొని ఒకరి ఇంటికి ఒకరు వెళతారు. నందు ఇంటికి వెళ్లిన గౌతమ్, వారి ప్రేమతో జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఆ కుటుంబ కష్టాలు తీర్చడానికి చిన్న ఉద్యోగంలో చేరతాడు. కానీ వరుసగా నందు కుటుంబానికి ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో తన ఆస్తి మీద కన్నేసిన విష్ణు ప్రసాద్ స్నేహితుడు ముద్ర (ముఖేష్ రుషి) మీద గౌతమ్ కు అనుమానం వస్తుంది. మరి నిజంగా ముద్రానే నందు కుటుంబాన్ని ఎటాక్ చేశాడా..? ఆ ప్రమాదాల నుంచి నందు ఫ్యామిలీని గౌతమ్ ఎలా కాపాడాడు..? చివరకు నందు, గౌతమ్ లు ఎవరి స్థానాల్లోకి వారు వచ్చారా..? అన్నది సినిమాలో చూడాలి ….
దర్శకడు సంపత్‌ నంది కథ పరంగా ఎక్కడా కొత్తదనాన్ని చూపించలేదు. ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు అటు, ఇటు మారడం అనే కాన్సెప్ట్‌ను ఎప్పటి నుండో చూస్తున్నాం. సినిమా చివర్లో బలమైన ట్విస్ట్, ముగింపు ఇచ్చినా… డ్యూయల్ రోల్ సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే కథనే తనదైన స్టైల్లో కొత్తగా ప్రజెంట్ చేయాలనుకున్నాడు . గోపిచంద్ మేకోవర్ తో పాటు సినిమాను స్టైలిష్ గా ప్రజెంట్ చేయటం లో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ కనిపిస్తుంది. ధనవంతుడైన గౌతమ్ లైఫ్ స్టైల్ ను పరిచయం చేయడం కోసం సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్, భవంతులు, కార్లు, యాక్ససరీస్ అన్నీ… ఒక బిలీనియర్ కొడుకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఫస్ట్ హాఫ్ క్లాస్ గా నడిపించిన సంపత్ నంది, సెకండాఫ్ లో తన మార్క్ చూపించాడు. కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ను కలగలిపిన దర్శకుడు … ఎమోషనల్ సీన్స్ తో పాటు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో కొంత వరకూ అలరించాడు.
అయితే , సెకండాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కథనం నిరుత్సాహంగా సాగింది .సినిమా కొన్ని చోట్ల మరీ నీరసంగా సాగింది.చాలా సన్నివేశాలను కథనంలోకి బలవంతంగా ఇరికించినట్టు అనిపించింది  . ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా బలమైన రొమాంటిక్ ట్రాక్ నడపలేక పోయాడు దర్శకుడు. ఇక ఫ్యామిలీ ఎమోషన్ బాగున్నా అవసరానికి మించినట్టు తోచాయి. సెకండాఫ్ లో  చివరి అర్థగంట కథ బావుంది. వాన ఫైట్‌ బావుంది. “పేర్లలోనే తేడా పేపర్‌ ఒకటే”, “బలిసినోడికి.. లేనోడికి ఓకే బస్టాండ్‌. కానీ బ్రతులే వేరు”…వంటి డైలాగ్స్‌ మెప్పిస్తాయి.
గోపీచంద్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. బిలియనీర్‌ తనయుడు గౌతమ్‌, దిగువ మధ్య తరగతి యువకుడు నందుగా రెండు విభిన్న పాత్రల్లో చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. ఈ సినిమా అతనికి ‘ప్రయోగాలకు మరో హీరో’ అనే కొత్త ఇమేజ్ ను తెస్తుంది .హన్సిక మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటించింది.హన్సిక పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో పరవాలేదనిపించింది.కేథరిన్‌ బాగా డబ్బున్న అమ్మాయిగా కనబడి, బికినీ అందాలతో కుర్రకారు మనసుని దోచేసింది. వెన్నెల‌ కిషోర్, తీన్మార్ స‌త్తి కామెడి ఓకే. అయితే అనుకున్న రేంజ్‌లో కామెడి వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక చంద్రమోహన్‌, సచిన్ కేడ్కర్,తనికెళ్ళభరణి, సీత, విలన్స్‌గా నటించిన ముకేష్‌రుషి , నికితన్‌ ధీర్‌ సహా అందరూ పాత్రలకు న్యాయం చేశారు.

 సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ సుందర్ రాజన్ సినిమాటోగ్రఫి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా  మంచి అనుభూతిని ఇచ్చింది. డ్యూయల్ రోల్ సీన్స్ చాలా నేచురల్ గా కనిపించాయి. ఇక థమన్ సంగీతం రెండు పాటల వరకే బాగుంది…. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. ఎడిటింగ్ బాగానే ఉంది. జె. భగవాన్, జె. పుల్లారావు భారీ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని  పెంచాయి – ధరణి