వృధా ప్రయాస ….. ‘ఆక్సిజన్’ చిత్ర సమీక్ష

                                      సినీవినోదం రేటింగ్ : 2/5
శ్రీ సాయిరామ్ క్రియేష‌న్స్‌ బ్యానర్ పై ఎ.ఎం.జోతికృష్ణ‌ దర్శకత్వం లో ఐశ‌్వ‌ర్య‌.ఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు .
 
 రఘుపతి (జగపతి బాబు) ఎన్నో వ్యాపారాలతో కోట్ల ఆస్తులున్న పెద్ద మనిషి. రాజమండ్రిలో ఉంటూ దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తుంటాడు. తన అన్నాతమ్ముళ్లు ,వాళ్ల పిల్లలతో కలిసుండే రఘుపతి కుటుంబంలోని వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు దారుణంగా హత్యకు గురవుతుంటారు. ఇది ముందుగా తన ఊళ్లో ఉన్న ప్రత్యర్థి వీరభద్రం (షియాజీ షిండే) పనే అనుకున్నా.. తరువాత కాదని తెలుస్తుంది. రఘుపతి కుటుంబం ఈ భయాల్లో ఉండగానే ఆయన కూతురు శృతికి అమెరికా సంబందం వస్తుంది. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేసే కృష్ణ ప్రసాద్ (గోపిచంద్) శృతిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. అయితే తన కుటుంబాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టం లేని శృతి ఎలాగైన ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలని ప్లాన్ చేస్తుంది. కానీ కృష్ణ ప్రసాద్ మంచితనం కారణంగా ఇంట్లో వారంతా శృతిని కృష్ణప్రసాద్ కే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. అదే సమయంలో రఘుపతి కుటుంబం అజ్ఞాత శత్రువు కారణంగా ప్రమాదంలో పడుతుంది. అసలు రఘుపతి కుటుంబాన్ని అంతం చేయడానికి చూస్తున్న ఆ అజ్ఞాత శత్రువు ఎవరు..? రఘుపతి కుటుంబాన్నిఎందుకు అంతం చేయాలనుకుంటున్నారు ..? రఘుపతి ఇంటికి అల్లుడుగా వచ్చిన కృష్ణప్రసాద్ ఎవరు..? అన్నది సినిమాలో చూడాలి …
 
‘లౌక్యం’ త‌ర్వాత మూడేళ్లుగా స‌రైన హిట్ లేని గోపీచంద్‌తో ప్రముఖ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం త‌న‌యుడు ఎ.ఎం.జోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో వచ్చిన చిత్రం ఇది. దర్శకుడు జ్యోతి కృష్ణ అనుకున్న పాయింట్ బాగానే ఉన్నా తెరమీద చూపించిన విధానం సరిగా లేదు. కొన్ని ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు బాగానే ఉన్నా అనవసరమైన సీన్లతో లెంగ్త్ ఎక్కువై బోర్ కొట్టింది.కథకు అవసరం లేని గ్రామీణ నేపద్యం లో సన్నివేశాలను రాసుకొని సినిమా నిడివిని పెంచేసి ఇబ్బందిపెట్టాడు. భారీ తారాగణం ఉన్నా పాత సీన్స్, బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే వలన నీరసపడింది .యువత సిగరెట్స్ కు అలవాటుపడి ప్రాణాలు కోల్పోతున్నారు, ఆ వ్యసనాన్ని అంతం చెయ్యాలనే హీరో చేసే ప్రయత్నం బాగుంది. ఇంటర్వెల్ సమయానికి కథలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంది.
 
గోపిచంద్ మరోసారి మాస్ యాక్షన్ సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ లో పరవాలేదనిపించిన గోపిచంద్, ద్వితీయార్థంలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు . ముఖ్యంగా ఎమోషనల్ యాక్షన్ సీన్స్ లో బాగా చేసాడు . మంచి మనసున్న అమెరికా అబ్బాయిగా, రఫ్ అండ్ టఫ్ ఆర్మీ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ అద్భుతంగా చూపించాడు. రాశీఖన్నా పల్లెటూరి అమ్మాయిలా అందంగా కనిపించింది. పెద్దగా నటనకు స్కోప్ లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించింది. అను ఇమ్మాన్యుయేల్ ది ఒక ర‌కంగా గెస్ట్ రోల్‌.అయితే కథను మలుపు తిప్పే కీలకమైన గీత పాత్రకు అను పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. సీనియర్ నటుడు జగపతి బాబు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. చంద్ర‌మోహ‌న్‌, సుధ జంటబాగుంది . సావిత్రి పాత్రలో అలీ చేసిన కామెడీ కొంత నవ్వించింది. ఇతర పాత్రల్లో షియాజీ షిండే ,బ్రహ్మాజీ, కిక్ శ్యాం, అభిమాన్యు సింగ్ తదితరులు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. కాలకేయ ప్రభాకర్, అమిత్ కుమార్ తివారిలు కీలక పాత్రలు బాగా చేసారు .
 
యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. చిన్నా అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చిన్నా సినిమా స్థాయిని పెంచాడు. ఛోటా కె.నాయుడు, వెట్రి సినిమాటోగ్రఫి,కొన్ని సన్నివేశాల్లో సంభాషణలు బాగున్నాయి. సినిమా నిడివి బాగా ఎక్కువగా ఉంది. ఎడిటర్ ఉద్దవ్ మొదటి సగంలో కొన్ని అవసరంలేని సన్నివేశాలని కత్తిరించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి  – ధరణి