రొటీన్ కమర్షియల్… ‘పంతం’ చిత్ర సమీక్ష

                                    సినీవినోదం రేటింగ్ : 2.5/5

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వం లో కె.కె.రాధామోహ‌న్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్ట‌ర్ జ‌యేంద్ర (సంప‌త్‌), హెల్త్ మినిస్ట‌ర్ (జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి). వారిద్ద‌రి డ‌బ్బును ప్లాన్ వేసి కొట్టేస్తుంటాడు ఓ వ్య‌క్తి (గోపీచంద్‌). ఓసారి మినిస్ట‌ర్ కాన్వాయ్ నుంచి, మ‌రోసారి రైలు భోగీ నుంచి, మ‌రోసారి మినిస్ట‌ర్ హ‌వాలా చేసే డ‌బ్బు, ఇంకోసారి మినిస్ట‌ర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ద‌గ్గ‌ర దాచిన డ‌బ్బు … ఇలా చాలా విధాలుగా కోట్ల రూపాయాల‌ను కొట్టేస్తుంటాడు. త‌మ డ‌బ్బును కొట్టేసిన వ్య‌క్తి ఎవ‌రో  జ‌యేంద్ర‌కు తెలుస్తుంది. అయితే ఆ వ్య‌క్తి మామూలు వాడు కాద‌నీ, ప్ర‌పంచంలో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఒక‌రైన సురానా ఇండ‌స్ట్రీ అధినేత కుమారుడ‌ని అర్థ‌మ‌వుతుంది. అంత డ‌బ్బున్న వ్య‌క్తి కుమారుడికి ఇలా హోమ్ మినిస్ట‌ర్ డ‌బ్బును దొంగ‌లించాల్సిన అవ‌స‌రం ఏంటి? అత‌నికి అనాథాశ్ర‌మానికి లింకేంటి? అత‌ను కొట్టేసిన డ‌బ్బును ఏం చేశాడు? డొనేష‌న్లు కూడా అవ‌స‌రం లేనంత‌ నిధులున్న అనాథాశ్ర‌మానికి అత‌ని వ‌ల్ల క‌లిగిన ఉప‌యోగం ఏంటి? అనేది సినిమాలో చూడాలి….
విదేశాల్లో కోటీశ్వ‌రుడైన యువ‌కుడు త‌న స్వ‌దేశం వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ ప్ర‌జ‌ల ప‌రిస్థితి చూసి బాధ ప‌డతాడు . మంత్రులు, అధికారులు ఆ డబ్బును ఎలా దోచేస్తున్నారో గమనించి ,వారి ప‌ని ప‌ట్ట‌డ‌మే క‌థాంశంగా దర్శకుడు చక్రవర్తి ఈ సినిమా చేసారు . కొత్త స‌బ్జెక్ట్ కాకుండా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను మెసేజ్ మిక్స్ చేసి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే సెకండాఫ్‌లో ఉన్న ఎఫెక్ట్ ఫ‌స్టాఫ్‌లో లేదు. ఇది వ‌ర‌కు చూసిన రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల స్టైల్‌లోనే సినిమా సాగుతుంది. అయితే ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న మెసేజ్ బావుంది. సామాజిక అంశం బాగానే ఉన్నా… ఇప్పటికే అలాంటి ప్లాట్ ఆధారంగా చాలా సినిమాలు వచ్చి ఉండటంతో, సినిమా చూస్తుంటే థ్రిల్ కలుగదు. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది. క్లైమాక్స్ చిత్రీక‌రించిన తీరు అభినంద‌నీయం.
మాస్‌ యాక్షన్‌ రోల్‌లో గోపిచంద్‌ రాబిన్‌ హుడ్ తరహా పాత్రలో బాగా చేసాడు . ఒక‌వైపు కోటీశ్వ‌రుడిగా, మ‌రోవైపు రాజ‌కీయ నాయ‌కుల న‌ల్ల‌ధ‌నాన్ని దోచుకునే దొంగ‌గా మెప్పించాడు. యాక్షన్‌ సీన్స్‌లో మంచి ఈజ్‌ చూపించాడు. ఫస్ట్ హాప్‌లో కామెడీ టైమింగ్‌తోనూ అలరించాడు. క్లైమాక్స్ సీన్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పే సంద‌ర్భంలోనూ గోపీచంద్ న‌ట‌న బాగుంది . ఇక మెహ‌రీన్ పాత్ర పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. ఫ‌స్టాఫ్‌లో ఆమె రోల్ ఎక్కువ సేపు తెర‌పై క‌న‌ప‌డినా.. సెకండాఫ్‌లో పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది. మెయిన్ విల‌న్ పాత్ర‌లో సంప‌త్ సునాయ‌సంగా న‌టించాడు.  ఫ‌స్టాఫ్ అంతా పృథ్వీ త‌న‌దైన కామెడీతో న‌వ్వించాడు.  హీరో స్నేహితుడి పాత్ర‌లో శ్రీనివాస‌రెడ్డి పాత్ర ప‌రిధిమేర చ‌క్క‌గా న‌టించాడు. రాళ్ళ‌ప‌ల్లి, అజ‌య్‌, హంసానందిని ఇత‌ర న‌టీన‌టులు పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు.
ర‌మేశ్ రెడ్డి, శ్రీకాంత్ రాసిన సంభాష‌ణలు బావున్నాయి. ముఖ్యంగా సినిమా చివ‌ర‌ కోర్టులో వ‌చ్చే స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్ ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్‌ రిచ్‌గా, స్టైలిష్‌గా ప్రజెంట్ చేశారు.గోపీ సుంద‌ర్ నేప‌థ్య సంగీతం ప‌రవాలేదు. పాట‌లు మెప్పించవు. కథనం మధ్యలో పాటలు స్పీడు బ్రేకర్లలా ఇబ్బంది పెడతాయి. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్ ప‌నితీరు బాగుంది . సినిమా తెర‌కెక్కించిన విధానంలో భారీ తనం కనిపించింది -ధరణి