7 C
India
Friday, April 19, 2024
Home వార్తలు చిన్న సినిమాల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సొంత ఓటీటీలు!

చిన్న సినిమాల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సొంత ఓటీటీలు!

దేశ వ్యాప్తంగా చిన్న చిత్రాలు విడుదలకు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఏ చిత్ర పరిశ్రమ మనుగడకైనా చిన్న చిత్రాలే ప్రధానం. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. ఏడాది నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి.  నిర్మాతలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ఈ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన కేరళ సర్కార్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విడుదలకు ఇబ్బంది పడుతున్న చిత్రాల కోసం ప్రభుత్వం తరఫున ఓ సొంత ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక శాఖామంత్రి సాజీ చేరన్‌ ప్రకటించారు. సొంత ఓటీటీ సంస్థ.. లేకుంటే, ఇప్పటికే బాగా పాపులర్‌ అయిన ఏదైన ఓ ఓటీటీ సంస్థను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని, దీని వల్ల పలు మలయాళ చిత్రాల విడుదల సమస్య తీరుతుందని ఆయన తెలిపారు. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల విషయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతమని దేశ వ్యాప్తంగా పలువురు చిత్ర ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. సొంత ఓటీటీ ద్వారా విడుదలయ్యే చిన్న చిత్రాలను ప్రేక్షకులు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాగే ఆర్థికంగా చిన్న నిర్మాతలకు కొండంత అండగా ఉంటుందనే అభిప్రాయాన్నీ సినీ ప్రముఖులు వ్యక్తం చేశారు. ఆగస్ట్‌లో ‘ఓనమ్‌’ పండగ నేపథ్యంలో సొంత ఓటీటీని నిర్మాతలకు అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో కేరళ ప్రభుత్వం ఉంది.

సొంత ఓటిటి కోసం ‘తమిళ చిత్ర నిర్మాతల మండలి’…  కేరళ ప్రభుత్వం మాదిరిగానే తమిళ చిత్ర పరిశ్రమ సైతం ఇదే తరహాలో  ఆలోచించి ఇప్పటికే కార్యాచరణలోకి దిగింది. ‘తమిళ చిత్ర నిర్మాతల మండలి’ సొంత ఓటీటీ కోసం ప్రయత్నాలను మొదలు పెట్టింది. దీని కోసం 2015-2021 మధ్యకాలంలో నిర్మించిన.. డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు విక్రయించని సినిమాలు, థియేటర్‌లో రిలీజ్‌ చేయలేక పోయిన చిత్రాలు, ఒకవేళ నిర్మాణం పూర్తి చేసుకుని, ఏదో ఒక సంస్థకు హక్కులు కేటాయించినప్పటికీ…  ఆ వివరాలను కూడా నిర్మాతల మండలికి అందజేయాలని  చిత్ర నిర్మాతలకు ఇప్పటికే తెలియజేసింది.

తెలుగు చిత్ర పరిశ్రమపై సర్వత్రా విమర్శలు!… ఇదిలా ఉంటే, చిన్న చిత్రాల విషయంలో ఈ తరహా మేలుచేసే నిర్ణయం తీసుకోకపోవడం గురించి.. తెలుగు చిత్ర పరిశ్రమపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక చిత్రాలను నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్‌కి గుర్తింపు ఉన్నప్పటికీ చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల విషయంలో అటు సినీ పెద్దలు, నిర్మాతల మండలితోపాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు  కామెంట్లు చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుందని, అలాంటి నిర్ణయం తీసుకుంటే టాలీవుడ్‌కి ఎంతో మేలు జరుగుతుందని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

చిన్న సినిమాల కోసం కేరళ ప్రభుత్వం అవలంభించిన పద్ధతిని తెలుగు రాష్ట్రాలూ పాటిస్తే, తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా సహాయకారిగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లోనూ చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు. ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఒకవేళ తెరిచినా మునుపటిలా ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. పైగా పలువురు అగ్ర నిర్మాతల గుప్పెట్లో చాలా థియేటర్లు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో సొంత ఓటీటీ దిశగా తెలుగు చిత్ర పరిశ్రమ అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని వారు పేర్కొంటున్నారు.