ఆ ఘన స్వాగతానికి చలించిపోయింది !

అగ్ర హీరోలందరితో నటించి నంబర్ 1 హీరోయిన్‌గా ఒకప్పుడు టాలీవుడ్‌లో  వెలిగింది ఇలియానా. మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి  హీరోలందరితో నటించి  పేరు తెచ్చుకుంది. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో అప్పటి నుంచే ఆమె పతనం మొదలైంది. మొదట్లో కొన్ని బాలీవుడ్ సినిమాలో వరుసగా అవకాశాలు వచ్చాయి. కొన్ని హిట్స్ అయినా మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమెను అక్కడ పట్టించుకోవడం మానేశారు.

ఈ పరిస్థితుల్లో అనుకోని అవకాశం టాలీవుడ్ నుంచి వచ్చింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే సినిమా తెరకెక్కుతోంది.  ఇందులో ఇలియానాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే బాలీవుడ్‌కు వెళ్లిన ఈ భామ ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతుందని భావించారు… కానీ అవకాశాలు లేకపోవడంతో ఆమె పెద్దగా డిమాండ్ చేయలేదట. తొలిరోజు షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ రాగానే ఆమెకు అదిరిపోయే రీతిలో చిత్ర యూనిట్  స్వాగతసత్కారాలు ఏర్పాటుచేసింది. ఓ స్టార్ హీరోయిన్‌గా ఆమెను చూసుకున్నారు. మంచి స్టార్ హోటల్ రూముతో పాటు అన్ని వసతులను కల్పించారు. చాలా కాలం  తర్వాత తెలుగులో నటిస్తుండడంతో తనకు ఆదరణ  ఎలా ఉంటుందోనని ఇలియానా భయపడిందట. కానీ సినిమా యూనిట్ ఆమెను నెత్తిన పెట్టుకోవడంతో ఇలియానా కళ్ల వెంట జలజలా కన్నీళ్లు రాలాయి. తనను అపూర్వంగా ఆదరించిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి, సినిమా యూనిట్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఇలియానా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

నన్ను పూర్తిగా మార్చింది ఆండ్రూనే !

ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీపోన్‌ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే.ఇలియానా ప్రేమ వ్యవహారం కుతూహలాన్నే రేకెత్తిస్తోంది.అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలను తరచూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ వార్తల్లో ఉంటోంది. అయితే తన ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా ప్రకటించకపోవడంతో రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.దీంతో ఇలియానా  మీడియా వర్గాలపై ఆగ్రహంతో రంకెలు వేయడం పరిపాటిగా మారింది. అయితే ఇన్నాళ్లకు తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి నోరు తెరిసింది. ఇలియానా  ఆండ్రూ తన బాయ్‌ఫ్రెండ్‌ అని అంగీకరించింది.

నన్ను అర్థం చేసుకునే ప్రేమికుడు లభించాడని అంది. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం అని చెప్పింది. తన మనసుకు బాధ కలిగినప్పుడు తాను వెతికే మొదటి వ్యక్తి అండ్రూ అని పేర్కొంది. సాధారణంగా తాను మనోవేదనకు గురైనప్పుడు ఎవరినీ కలవనని చెప్పింది. ఇంటిలోనే ఒంటరిగా కూర్చుని ఏడ్చేస్తానని అంది. ఆ సమయంలో ఎవరైనా తనను కలవాలని ప్రయత్నిస్తే వారిని గట్టిగా తిట్టేస్తానని చెప్పింది. అలాంటి తనను పూర్తిగా మార్చింది ఆండ్రూనేనని అంటోంది ఇలియానా.