ముప్పైకి పైగా సినిమాలు అందుకోసం వదులుకున్నా !

మనసుకు నచ్చిన కథలు లభించకే తాను విరామం తీసుకున్నానని,సినిమాలకు తాను గుడ్‌బై చెప్పబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అంటోంది హన్సిక. తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది హన్సిక. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే హన్సిక జోరు ప్రస్తుతం తగ్గింది. గత కొన్ని నెలలుగా హన్సిక కొత్త సినిమాలేవి అంగీకరించకపోవడంతో ఆమె సినిమాలకు దూరమవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవకాశాలు రాకపోవడం, పరాజయాల కారణంగా ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నారు.
అయితే, ఈ పుకార్లను ఖండించింది హన్సిక. ఈ మధ్యనే తన వద్దకు వచ్చిన ముప్పైకిపైగా సినిమాల్ని కథలు నచ్చక తిరస్కరించానని చెప్పింది.హన్సిక మాట్లాడుతూ…. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్లు అవుతున్నది.ఈ ప్రయాణంలో గ్లామర్ డాల్, బబ్లీ గర్ల్ ఇమేజ్‌తో కూడిన పాత్రలు చేశాను. ఆ ముద్ర నుంచి దూరమవ్వాలనే ఆలోచనలో ఉన్నాను. ఇకపై నాలోని నటనాప్రతిభను సంతృప్తిపరిచే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను.
ప్రస్తుతం అలాంటి కథల కోసమే అన్వేషిస్తున్నాను. కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి. కానీ అవేవి నా మనసుకు నచ్చడంలేదు. సినిమాప్రపంచంలో పడి వ్యక్తిగత ఆనందాల్ని చాలా త్యాగం చేశాను. ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నా అభిరుచులకు అనుగుణంగా ఇటీవలే కొత్త ఇంటిని నిర్మించుకున్నాను. నాకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ కోసం సమయాన్ని కేటాయించే అవకాశం దొరికింది. త్వరలో ఓ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నాను అని తెలిపింది.
జీవిత కథల ట్రెండ్‌పై హన్సిక స్పందిస్తూ… నటిగా శ్రీదేవి నాకు స్ఫూర్తి. ‘సద్మా’ చూసి ఆమెకు పెద్ద అభిమానిగా మారిపోయాను. అవకాశం వస్తే శ్రీదేవి జీవితకథలో నటించాలనుంది అని చెప్పింది.