ఒక పక్క హ్యాకింగ్ … మరో పక్క యాక్సిడెంట్ !

అందాల హ‌న్సిక…  సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హ‌న్సిక త‌న సినిమా విశేషాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని కూడా షేర్ చేస్తుంటుంది. ఈ మ‌ధ్య హ‌న్సికకి సంబంధించిన హాట్ పిక్స్ కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ షాక్‌కి గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో హ‌న్సిక త‌న ట్విట్ట‌ర్ లో… “నా ఫోన్ మ‌రియు ట్విట్ట‌ర్ హ్యాక్ అయింది. ఏ మెసేజ్‌కి మీరు స్పందించ‌వద్దు. నా బ్యాక్ ఎండ్ టీం దీనిపై విచార‌ణ జ‌రిపి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు” అనే కామెంట్ పెట్టింది. హ‌న్సిక ఇటీవ‌ల తెలుగులో ‘క‌థానాయకుడు’ చిత్రంలో జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో మెరిసిన విష‌యం విదిత‌మే.

యాక్షన్ సన్నివేశాల్లో చేతికి గాయం !

తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా హన్సికకి మంచి క్రేజ్ వుంది. అయితే తెలుగులో కన్నా తమిళంలో ఆమెకి ఎక్కువగా అవకాశాలు రావడంతో, అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అడపా దడపా తెలుగు తెరపై కూడా మెరుస్తూనే వచ్చింది. అలా 49 సినిమాలు పూర్తి చేసిన హన్సిక, తమిళంలో 50వ సినిమా చేస్తోంది. ఆమె 50వ చిత్రంగా ‘మహా’ రూపొందుతోంది. నూతన దర్శకుడు జమీల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో జరిగే కథ ఇది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా, ఆమె చేతికి గాయమైందట. అయినా హన్సిక ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.