“హ్యారీపొటర్‌” హీరో … నిజజీవితంలోనూ హీరోనే !

“హ్యారీపొటర్‌” హీరో డానియెల్‌ ర్యాడ్‌క్లిప్‌ నిజజీవితంలోనూ రియల్‌ హీరో అనిపించుకున్నాడు. మోటారు వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ పర్యాటకుడిపై దాడి చేయగా.. అక్కడే ఉన్న ర్యాడ్‌క్లిప్‌ క్షణం ఆలస్యం చేయకుండా బాధితుడికి సహాయం చేశాడు. ముఖానికి గాయమైన అతడిని ఆదుకున్నాడు. ఈ ఘటన లండన్‌లోని ఫ్యాషనబుల్‌ కింగ్స్‌ రోడ్డులో జరిగింది. మోటారు వాహనంపై దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు పర్యాటకుడి వద్దనుంచి బలవంతంగా బ్యాగు లాక్కెళ్లారు. దీంతో కిందపడిపోయిన పర్యాటకుడి ముఖానికి గాయాలయ్యాయి.

దుండగుల చర్యను గమనించిన  ఓ మాజీ పోలీసు వెంటనే తన వాహనాన్ని వారి మోపెడ్‌కు అడ్డంగా పెట్టారు. దీంతో బెదిరిపోయిన దుండగులు పారిపోయారు. అనంతరం సంఘటనాస్థలికి వచ్చి ఆ మాజీ పోలీసు అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. ఎందుకంటే … కిందపడిన బాధితుడికి సాయం చేస్తూ యువహీరో ర్యాడ్‌క్లిప్‌ కనిపించాడు. ’నేను చూసింది నిజమేనా అని నమ్మలేకపోయాను. మీరు ’డానియెల్‌ ర్యాడ్‌క్లిప్‌’ కదా! అని అడిగాను. ‘ఔను’ అంటూ ఆయన బదులిచ్చారు. అతను చాలామంచి వ్యక్తి. చాలామంది సినీ ప్రముఖులు అలాంటి పరిస్థితులను చూసి ఆగనైనా ఆగరు’ అని ఉగ్రవాద నిరోధక దళంలో పనిచేసిన ఆ అధికారి వివరించారు. ఈ ఘటన నిజమేనని ర్యాడ్‌క్లిప్‌ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.