సేవా గుణానికి అతన్నే ఆదర్శంగా తీసుకోవాలి !

సూర్య వెండితెరపై తన నటనా ప్రతిభతో అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నాడు. నిత్యం సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే సూర్యకు.. సమాజం పట్ల సేవాదృక్పథం చాలా ఎక్కువ. సమాజంలో ఆర్ధికంగా బలహీనంగా ఉన్న వారికోసం, అనాధలకు సహాయం చేయాలని తపన పడే వ్యక్తిత్వం సూర్యది. అందుకే ఆయనకు నటుడిగానే గాక వ్యక్తిగానూ తమిళనాట చాలా మంచి పేరుంది.
 సేవా దృక్పథంతో ‘అగరం’ అనే ఓ ఫౌండేషన్ ప్రారంభించిన సూర్య.. ఈ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు లేక అనాధలుగా జీవితం వెళ్లబుచ్చుతున్న ఎంతోమంది చిన్నారులను అక్కున చేర్చుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఎంతో ఏకాగ్రతగా ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు సూర్య. కాగా ఇప్పటికే తమ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు ప్రతీ ఏడాది 500 మంది కాలేజీ విద్యార్థులకు ఆర్ధికంగా సహాయం చేయబోతున్నామని తాజాగా ప్రకటించారు సూర్య.
 హీరోగానే కాక వ్యక్తిగా సమాజం పట్ల సూర్య కున్న సేవా గుణాన్ని చూసి మురిసిపోతున్నారు ఈ ప్రకటన చూసిన అభిమానులు. నిజంగా నేటి సినీ, రాజకీయవేత్తలు సూర్యను ఆదర్శంగా తీసుకోవాలంటూ  ‘హ్యాట్సాఫ్ సూర్య..!’ అంటున్నారు