తుఫాన్ బాధితులకు స్వయంగా సాయమందించిన హీరో నిఖిల్

‘తితిలీ’ తుఫాన్ శ్రీకాకుళం ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింది. సామాన్య ప్రజానీకం కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. ఈ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి మొట్టమొదట రూ.50 వేలు సాయం ప్రకటించి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్ఫూర్తిగా నిలిచారు. అయితే  మొట్టమొదటిసారి హీరో నిఖిల్ సిద్ధార్థ ‘తితిలీ’ ప్రభావిత ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించి దగ్గరుండి మూడు వేల మందికి భోజన సదుపాయం కల్పించాడు.2500 కిలోల రైస్, 500 దుప్పట్లు, పవర్ కట్స్‌ని నివారించేందుకు పోర్టబుల్ జనరేటర్స్ అందించాడు. ప్రస్తుతం తాను శ్రీకాకుళం జిల్లా గుప్పిడిపేట గ్రామంలో ఉన్నానని.. అనంతరం తాను పల్లిసారధి గ్రామానికి వెళ్లనున్నానని నిఖిల్ తెలిపాడు. నిఖిల్ స్వయంగా తమ గ్రామాలకు వచ్చి సాయమందించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ ప్రముఖులు కొందరు ముందుకొచ్చారు
తితలీ తుపాను ధాటికి అతలాకుతలమైన సిక్కోలు వాసులకు అండగా, సహాయం చేయడానికి తెలుగు హీరోలు కొందరు  ముందుకొచ్చారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుపాను సృష్టించిన బీభత్సం వలన ఇబ్బందులు, కష్టాలు పడుతున్న ప్రజల సహాయార్థం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశారు. తితలీ తుపాను బాధితుల కోసం హీరోలు చిన్న ఎన్టీఆర్‌ రూ. 15 లక్షలు, నందమూరి కల్యాణ్‌రామ్‌ రూ. 5 లక్షలు, వరుణ్‌తేజ్‌ రూ. 5 లక్షలు, దర్శకుడు అనిల్‌ రావిపూడి రూ. 1 లక్ష ఆర్థిక సహాయం చేశారు. ఇంతకు ముందు విజయ్‌ దేవరకొండ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్‌బాబు రూ. 50 వేలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే!
దృష్టి మళ్లించిన ఘనత సంపూర్ణేష్ బాబుదే
‘తితిలీ’ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం అస్తవ్యస్తమైంది. అక్కడి ప్రజలు చాలా వరకూ నీడ కోల్పోయారు. ఈ సమయంలో సినీ ఇండస్ట్రీ నుంచి ముందుగా ఆపన్నహస్తం అందించి.. సినీ ప్రముఖుల దృష్టిని శ్రీకాకుళం వైపు మళ్లించిన ఘనత మాత్రం బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుదే. తన వంతు సాయంగా రూ.50 వేలు ప్రకటించి చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. దీంతో ఒక్కొక్కరుగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ  సిక్కోలుకు సాయమందించి పెద్ద మనసు చాటుకుంటోంది.
సంపూ చేసిన పనిని ఎంపీ రామ్మోహన్ నాయుడు అభినందించారు. ‘శ్రీకాకుళం ప్రజలపై నువ్వు చూపిన ప్రేమకి, సపోర్ట్‌కి థాంక్యూ సంపూర్ణేష్. నీ మనసు చాలా విశాలమైనదని చాటుకున్నావు. శ్రీకాకుళం ప్రజలు ఇంత కష్ట సమయంలో నువ్వు చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటారు’ అని ట్వీట్ ద్వారా తెలిపారు.