ఆమె డిమాండ్ ఏరేంజ్ లో ఉందో చూడండి …

సినిమాలో మన ఇంట్లోనో, పక్క ఇంట్లోనో ఉండే అమ్మాయిలా ఓ కథానాయిక చేస్తే ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. సినిమా ఆఫర్లు భారీ స్థాయిలో పెరుగుతాయి కాబట్టి …అలాంటివారికి డిమాండ్ తో కాల్‌షీట్ల సమస్యా తలెత్తుతుంది. ప్రస్తుతం అలా నటిస్తుందన్నది ఎవరంటే… సాయి పల్లవి. తెలుగు చిత్రసీమలో ఆమె చేసిన రెండు చిత్రాలూ విజయం సాధించడంతో విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. టాలీవుడ్‌లో ‘ఫిదా’ తో మొదలైంది ఆమె కెరీర్‌. ఇప్పుడు రెండో చిత్రం ‘ఎంసీఏ’ కూడా సూపర్‌హిట్‌ అయింది. త్వరలో శర్వానంద్‌, తమిళ్‌ హీరో సూర్యతో చేయనుంది. సోమవారమే సూర్య చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సాయి పల్లవి ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. శర్వానంద్‌తో హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పల్లవి కథానాయిక. ఫిబ్రవరి చివరిలో షూటింగ్‌ అనుకున్నారు. దీనికి ముందు శర్వా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో చేయనున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్‌ చివరిలో ప్రారంభించాడు. కానీ ఫిబ్రవరిలో సాయి పల్లవి తన చిత్రం షూటింగ్‌కు రావడం సాధ్యం కాదని తెలుసుకుని …వెంటనే సుధీర్‌ వర్మతో చేసే చిత్రీకరణను ఆపు చేసి, హను రాఘవపూడి సినిమా చిత్రీకరణను ఈ నెలలో ప్రారంభించబోతున్నారట. దానికి పల్లవి కూడా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందట. అంటే పల్లవికి తెలుగులో ఎంత క్రేజ్‌ ఉందో అర్ధమవుతుంది.

 కోటిని టచ్‌ చేయడానికి రెడీగా ….

ప్రతిభ కావచ్చు, అదృష్టం కావచ్చు. తాజాగా  లక్కీగళ్‌ ఎవరైనా ఉన్నారంటే… అది  సాయిపల్లవినే. ఇప్పటి వరకూ నటించింది మూడు చిత్రాలే. అందులో రెండు చిత్రాలు అద్బుత విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఈ అమ్మాయిని చాలా మంది కేరళకుట్టి అనుకుంటారు. కారణం తను నటిగా పరిచయమైంది మలయాళ చిత్రంతో. నిజానికి సాయిపల్లవి అచ్చ తమిళ అమ్మాయి. తమిళనాడులోని కోటగిరి గ్రామంలో పుట్టి పెరిగింది. కోయంబత్తూర్‌లో ఉన్నత విద్యను అభ్యసిందింది.

మెడికల్‌ స్టూడెంట్‌ అయిన సాయిపల్లవి మంచి డాన్సర్‌. ఆ కళే తనను చిత్ర రంగానికి పరిచయం చేసింది. ‘ఉంగళిల్‌ యార్‌ అడుత్త’ ప్రభుదేవా డాన్స్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్న ఈ అమ్మడిపై మలయాళ దర్శకుడు అల్ఫోన్సన్‌ దృష్టి పడింది.అంతే 2015లో ఆయన దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ప్రధాన పాత్ర మలర్‌ టీచర్‌గా నటించింది. ఆ చిత్ర విజయం మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్‌ల్లోనూ  క్రేజ్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో పలు అవకాశాలు సాయిపల్లవి ఇంటి తలుపు తట్టాయి. మరో విషయం ఏమిటంటే …సాయిపల్లవి తొలుత కోలీవుడ్‌లోనే నటిగా పరిచయమైంది. జయంరవి, కంగనా రనౌత్‌ జంటగా నటించిన ‘ధామ్‌ ధూమ్‌’ చిత్రంలో ఒక చిన్న పాత్రను పోషించింది. అయితే అప్పట్లో ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు.

అయితే సాయిపల్లవి తొందర పడి వచ్చిన అవకాశాలను అంగీకరించలేదు.  ‘ప్రేమమ్‌’ చిత్రం తరువాత మాలీవుడ్‌లో ‘కలి’ అనే చిత్రం చేసింది. అంతే ఆ తరువాత టాలీవుడ్‌లో ‘ఫిదా’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇప్పుడు అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ‘టాక్‌ ఆఫ్‌ది సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీ’గా మారింది. రెండే రెండేళ్లు, మలయాళంలో ‘ప్రేమమ్’, తెలుగులో ‘ఫిదా’ చిత్రాలు సాయిపల్లవిని క్రేజీ నాయకిని చేసేశాయి. ఇంకా కోలీవుడ్‌లో నటించిన చిత్రం విడుదల కూడా కాలేదు. అప్పుడే అమ్మడి పారితోషికం కోటిని టచ్‌ చేయడానికి రెడీగా ఉందట.మలయాళ చిత్రంలో దర్శకుడు అల్ఫోన్సన్‌ ఎంత పారితోషికం ఇప్పిచ్చారో గానీ, తెలుగు చిత్రం‘ ఫిదా’కు మాత్రం, రూ. 10 లక్షలు పుచ్చుకుందట. ఆ చిత్రం తరువాత వెంటనే రూ.70 లక్షలకు పెంచేసిందని సమాచారం. విశేషం ఏమటంటే… సాయిపల్లవికి ఇంత భారీ పారితోషికం ఇవ్వవచ్చనే అభిప్రాయమే చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది.