‘హితుడు’ దర్శకుడు విప్లవ్ కొత్త చిత్రం

గతంలో నంది అవార్డు పొందిన చిత్రం ‘హితుడు’. కె.ఎస్.వి. పతాకంపై విడుదలైన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అందులో నక్సలైట్ పాత్రలో జగపతిబాబు, నటి మీరానందన్ తన పాత్రలో ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్ర దర్శకుడైన కె.విప్లవ్ ఇప్పుడు నూతన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కేఎస్వీ సమర్పణలో, సిరంజ్ సినిమా పతాకంపై ఓ సున్నితమైన ప్రేమకథాచిత్రంగా ఆయన దీనిని మలచనున్నారు. ‘ప్రేమకు రెయిన్ చెక్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన అభిలాష్, ‘అరవింద సమేత’, ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాల్లో నటించిన రాఘవ్ కథానాయకులుగా ఈ చిత్రానికి ఎంపికయ్యారు. ఈ తరం యువత జీవనశైలికి దగ్గరగా ఈ చిత్రం ఉంటుందని, ఆద్యంతం మనసును రంజింపజేసే సన్నివేశాలతో పాటు ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు కె.విప్లవ్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న స్క్రిప్టు పనులు పూర్తి కావచ్చాయని, త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ- కేఎస్వీ.