స్నేహితుల ఋణం ఇలా తీర్చుకున్నాడు !

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జార్జ్‌ క్లూనే తన స్నేహితులకు మర్చిపోలేని కానుక ఇచ్చారు. క్లూనే ఉద్యోగం కోసం లాస్‌ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు తన 14 మంది స్నేహితులు ఆయనకు ఆశ్రయమిచ్చి సాయం చేశారు. అలా అని వారు పెద్ద కోటీశ్వరులేం కాదు. అయినా, స్నేహితుడి కోసం తమ వంతు సాయం చేశారు. ఇప్పుడు క్లూనే స్టార్‌ నటుడు. ఈ స్థాయిలో ఉండటానికి ఆయన స్నేహితులే కారణం. అందుకే వారి రుణం తీర్చుకోవాలనుకున్నారు.

2013లో తనకు సాయం చేసిన స్నేహితులందరికీ ఫోన్లు చేసి విందుకు ఆహ్వానించారు. విందు ముగిసిన తర్వాత క్లూనే ఓ ప్రకటన చేస్తూ.. “మీరంతా నాకు ఎంత సాయం చేశారో మీకు తెలియాలి. నేను లాస్‌ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు మీరంతా ఆశ్రయం ఇచ్చారు. మీలాంటి స్నేహితులు ఉండటం నా అదృష్టం. మీరు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాను. ఇప్పుడు మీ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది” అని చెప్తూ వారికి ఒక్కో సూట్‌కేస్‌ కానుకగా ఇచ్చారు. ఆ సూట్‌కేస్‌లలో మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6.7కోట్లు) ఉండడం చూసి ఆయన స్నేహితులు అవాక్కయ్యారు. అంతేకాదు, ఈ మిలియన్‌ డాలర్లకు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా అన్ని ట్యాక్స్‌లు క్లూనేనే కట్టారట.