అయిన వాళ్ళకే అవార్డులు … మంచి సినిమాలకు కాదు !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులు ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా `హార్మోన్స్ ` చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు రోడ్డెక్కారు. 2012లో ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్.ఎస్ నాయ‌క్ నిర్మాత‌గా బంజారా మూవీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై `హార్మోన్స్` చిత్రం తెర‌కెక్కించి రిలీజ్ చేశారు. ‘వ్యవసాయం, వైద్యం, విద్యుత్’ అనే మూడు పాయింట్ల‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు ఆనంద్ సామాజిక దృక్ఫదంతో  చిత్రాన్ని తెర‌కెక్కించారు. గ్రామాల ద‌త్త‌త కాన్సెప్ట్ పై తెర‌కెక్కిన ఈ సినిమా క‌థ‌ను  అప్ప‌ట్లో  మెగాస్టార్ చిరంజీవి విని టీమ్ కు ఎంతో స‌హ‌కారాన్ని అందించారు. సాక్ష్యాత్తు మెగాస్టార్ ఈ సినిమా ఆడియో కు విచ్చేసి..  ‘మంచి సినిమా చేశార‌’ని అభినంద‌న‌లు తెలియ‌జేశారు.  2012 అవార్డుల్లో భాగంగా జాతీయ స‌మ‌గ్ర‌త చిత్రాల కేట‌గిరిలో 10,000 రుసుము చెల్లించి ఈ చిత్రం కూడా ద‌రఖాస్తు చేసుకుంది. ఆ కేట‌గిరిలో ఈ సినిమాతో పాటు `ఆగ‌స్టు 15 రాత్రి` అనే సినిమా మాత్ర‌మే ఉన్నాయి. కానీ జ్యూరి మాత్రం ఈ రెండు సినిమాల‌ను పాతాళానికి తొక్కేసింద‌ని  మీడియా స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌క‌, నిర్మాత ఆవేదన వ్య‌క్తం చేశారు.
చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ మాట్లాడుతూ, ` చిరంజీవి గారు మా సినిమా చూసి త‌న తొలి సినిమా ‘పునాది రాళ్లు’ లాంటి మంచి సినిమా అని మెచ్చుకున్నారు. కానీ మా సినిమా జ్యూరీ క‌మిటీ చైర్ ప‌ర్స‌న్  క‌నీసం చూసిన పాపాన కూడా పోలేదు. కేవ‌లం జ్యూరీ స‌భ్యులు చూసి ఎలాంటి నిర్ణ‌యం చెప్ప‌లేరు. అలా ఎందుకు జ‌రిగింద‌ని ప్ర‌శ్నిస్తే? మీలాంటి వాళ్లు మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తారా? అంటూ తిరిగి మమ్మ‌ల్నే బ‌ద్నామ్ చేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం . వాళ్లు కూడా ప‌ట్టించుకోలేదు. ఈ వివ‌రాలు సేక‌రించ‌డానికే మాకు మూడు నెల‌లు స‌మ‌యం ప‌ట్టింది. ఇప్ప‌టికైనా 2012 క‌మిటీని ర‌ద్దు చేసి కొత్త క‌మిటీ ఏర్పాటు చేసి మంచి సినిమాల‌కు న్యాయం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.
నిర్మాత ఎన్.ఎస్ నాయ‌క్ మాట్లాడుతూ, ` అవార్డుల‌న్నీ ప్ర‌భుత్వం చుట్టాల‌కు…వాళ్ల స్నేహితుల‌కు మాత్ర‌మే ఇస్తుంది. అలాంట‌ప్పుడు మా లాంటి వాళ్ల‌ను ఎందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోమంటున్నారు? ఎలాంటి నోటిఫికేష‌న్ ఇవ్వ‌కుండా వాళ్ల‌కు ఇష్టం వ‌చ్చిన వాళ్ల‌కు అవార్డులు ఇచ్చుకుంటే ఎవ్వ‌రూ అడ‌గ‌ర‌దు క‌దా! సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద వాళ్లంతా ప‌దవుల్లో కొన‌సాగుతారు. కానీ అన్యాయం జ‌రిగితే మాత్రం ప్ర‌శ్నించ‌డానికి ఒక్క‌డు రాడు. సినిమా ప‌రిశ్ర‌మ గురించి బ‌య‌ట జ‌నాలు చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారన్న‌ విష‌యాలు వాళ్ల‌కు తెలియ‌డం లేదేమో. ఇప్ప‌టికైనా బుద్ది తెచ్చుకుని పాత క‌మిటిని ర‌ద్దు చేసి కొత్త క‌మిటీని ఏర్పాటు చేసి సినిమాలు అన్నింటిని మ‌ళ్లీ స్క్రీనింగ్ కు వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకుంటే మంచిద‌ని` అని అన్నారు.