హాలీవుడ్‌లో ఎంటరయ్యేందుకు హృతిక్‌ నాయకత్వం!

అమెరికాకు చెందిన గెర్ష్‌ ఏజెన్సీతో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. హృతిక్‌ రోషన్‌ గ్లోబల్‌ స్టార్‌లా మారునున్నారు. హాలీవుడ్‌లో ఎంటరయ్యేందుకు హృతిక్‌ నాయకత్వంలో అంతర్జాతీయ సినీ వినోద రంగంలో భారత్‌ను ముందు నిలుపుతామని, దేశంలో వినూత్న క్రియేటర్లకు ఇతర మార్కెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని గెర్ష్‌తో భాగస్వామ్యం ద్వారా హృతిక్‌ విజన్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ సంస్థ క్వాన్‌ మేనేజర్‌ అమృతా సేన్‌ వెల్లడించారు. గెర్ష్‌ ఏజెన్సీ హృతిక్‌ను హాలీవుడ్‌కు పరిచయం చేయడంతో పాటు భారత్‌లో ఆయా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా చూస్తుంది. నటుడు, నిర్మాత రాకేష్‌ రోషన్‌ కుమారుడు హృతిక్‌ రోషన్‌ 2000లో ‘కహోనా ప్యార్‌ హై’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకే హృతిక్‌ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన హృతిక్‌ సినిమాలు ‘సూపర్‌ 30’, ‘వార్‌’ మూవీలు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి.
 
అద్భుత నటనకు అవార్డు
‘సూపర్‌ 30’ మూవీలోని నటనకు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌’ అవార్డును 2020కి గాను హృతిక్‌రోషన్‌ గెలుచుకున్నారు.హృతిక్‌ రోషన్‌ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించిన చిత్రం ‘సూపర్‌ 30’. ఆనంద్‌ కుమార్‌ పాత్రలో హృతిక్‌​ అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వికాస్ బల్ దర్శకత్వం వహించిన ‘సూపర్‌ 30’లో టీవీ నటి మృణాల్‌ ఠాకూర్‌, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్‌, పంకజ్‌ త్రిపాఠి నటించిన విషయం తెలిసిందే. కండలతో ఉండే హృతిక్‌ ఈ మూవీలో పూర్తి భిన్నంగా కనిపించి తన అద్భుత నటనతో ప్రేక్షాదరణ పొందారు. కాగా హృతిక్‌ ఇటీవల ‘వార్‌’ చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
 
ఈ జంట తొలిసారి స్క్రీన్‌ మీద
హృతిక్‌ రోషన్, దీపికా పదుకోన్‌నే ఇప్పటి వరకూ కలసి నటించలేదు. అయితే త్వరలోనే ఈ ఇద్దర్నీ జంటగా స్క్రీన్‌ మీద చూసే అవకాశం ఉందట. హృతిక్‌ రోషన్‌ నటించిన సూపర్‌ హీరో చిత్రం ‘క్రిష్‌’ సిరీస్‌లో నాలుగో భాగం పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ నటిస్తారని బాలీవుడ్‌ టాక్‌. ‘హృతిక్‌తో కలసి నటించాలనుంది’ అని పలు సందర్భాల్లో దీపికా తన ఆసక్తిని తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా దాదాపు ఫైనల్‌ అట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.