తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడమే కాదు, సాయం చేసే విషయంలోను అదే స్థాయిలో స్పందిస్తానని మరోసారి నిరూపించుకున్నారు ‘ఇలయదళపతి’ విజయ్. ఆయన తన ప్రతి సినిమా విడుదల తరువాత ఏదేని రూపంలో ఒక మంచి పనికి సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. గతంలో తనతో సినిమాలు తీసిన దర్శకులు 10 మందికి తలా 5 లక్షలు ఇవ్వడంతోపాటు, తమిళ సినీ దర్శకుల సంఘానికి రూ.15 లక్షలు విరాళం అందజేశారు. అలాగే ఫెఫ్సీ, ఇతర సంఘాలకూ తన వంతు సాయం చేశారు. తాజాగా తమిళ్‌లో విడుదల అయిన ‘మెర్సల్’ చిత్రం తెలుగులో కూడా భారీ విజయం దక్కించుకుంది. ఈ సినిమా విజయంతో మిక్కిలి సంతోషంగా ఉన్న విజయ్ దక్షిణభారత డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు, డ్యాన్స్ కళాకారుల సంఘానికి రూ.15 లక్షలు విరాళంగా ఇచ్చారు. అయినా తను విరాళాలు ఇచ్చినట్టు బయటకు తెలియకూడదని విజయ్ భావించేవారు. కానీ, ఎలాగో ఈ విషయం బయటకు రావడంతో తమ అభిమాన హీరో మంచితనం తెలుసుకుని అభిమానులు ఫిదా అయిపోయారు.
మురుగదాస్‌తో ముచ్చటగా ముడోసారి
ఇళయదళపతితో మళ్లీ ఇద్దరు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. అయినా యువ హీరోలే ఒకరికి మించిన హీరోయిన్ల చిత్రాల్లో డ్యూయెట్లు పాడడానికి ఆశ పడుతుంటే విజయ్ లాంటి స్టార్ హీరోకు ఇద్దరు హీరోయిన్లతో యువళగీతాలు పాడాలనుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అదీగాక మెర్సల్ లో ఏకంగా ముగ్గురు బ్యూటీస్‌తో ఆడి పాడేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఇళయదళపతి ఇంతకు ముందు కూడా తెరి చిత్రంలో ఇద్దరు భామలతో స్టెప్స్ వేసి విజయతీరాలను చేరారు. ఇక తాజాగా తన 62వ చిత్రానికి రెడీ అవుతున్న విజయ్ ‘తుపాకీ’, ‘కత్తి’ చిత్రాల దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌తో ముచ్చటగా ముడోసారి పనిచేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం జనవరిలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో ఒక కథానాయకిగా రకుల్‌ప్రీత్‌సింగ్ ఎంపికైంది.
ఇక మరో కథానాయకిగా బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హాను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ బ్యూటీ ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయ్యిందన్నది గమనార్హం. అయితే ఆ చిత్రం అపజయం పాలవ్వడంతో కోలీవుడ్‌లో సక్సెస్ అందుకోవాలన్న సోనాక్షి ఆశ నెరవేరలేదు. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఇళయదళపతితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందన్న మాట. ఈ చిత్రంతోనైనా ఈ అమ్మడు విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. విశేషం ఏమిటంటే సోనాక్షిసిన్హా, రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ ఇద్దరూ ఇప్పటికే ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించారు. హిందీ చిత్రం ‘అకిర’లో సోనాక్షిసిన్హా నాయకిగా నటించగా…. తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన ‘స్పైడర్’ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ నటించింది.