ఒకే సినిమాకి ముగ్గురు సంగీత రాజాల కలయిక !

సంగీతప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ముగ్గురు రాజాలు కలసి ఓసినిమాకి కలిసి పనిచేయబోతున్నారు.  ఇటీవల ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని పొందిన ఇళయారాజా తన ఇద్దరు కొడుకులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజాతో కలసి ఓ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
 భారతీయ సినిమా సంగీతంలో తనదైన ముద్రవేసుకున్న ‘మేస్ట్రో’ ఇళయరాజా మొట్టమొదటి సారి తన తనయులు ఇద్దరితో కలసి ఒక సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.  సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తోన్న కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజాతో కలసి ‘మామనిదన్’ అనే సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. శీను రామస్వామి దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా ఈ సినిమా నిర్మిస్తున్నాడు.
 నిర్మాతగా మారిన తనయుడు యువన్ శంకర్ రాజాకు మంచి విజయం అందివ్వడానికి తన వంతుగా వారసులతో కలసి సంగీతం ఇస్తున్నాడట ఇళయరాజా. రీసెంట్‌గానే యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తోన్న ‘మారి-2’ సినిమాలో ఓ పాట పాడాడు మేస్ట్రో. ఇళయరాజాకు భారత రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్’ వచ్చిన సందర్భంగా, ఈ వార్తను మీతో పంచుకుంటున్నానంటూ ముగ్గురి కలయిక గురించి ట్వీట్ చేశాడు యువన్ శంకర్ రాజా. యువన్ అలా ట్వీట్ చెయ్యడం ఆలస్యం కోలీవుడ్‌లో ఈ వార్త వైరల్ అయిపోయింది. మీ సాంగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం అంటూ రీట్వీట్ల వరద మొదలైంది.