డిప్రెషన్‌ నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది !

నటిగా నేను అనుకున్నంత గొప్ప స్థితిలో లేనని, మిగతా నటీమణులందరూ నాకంటే మెరుగ్గా ఉన్నారనీ అర్థం లేని ఆలోచనలు వేధించేవి.అందరూ నా కంటే మంచి ఫామ్‌లో ఉన్నారనిపించేది. అసలు అప్పుడు నాకు కలిగిన భావనలను మాటల్లో చెప్పలేను. అలాంటి అనుభవానికి లోనయిన వాళ్లు మాత్రమే నా బాధ ఎలా ఉండి ఉంటుందో అర్థం చేసుకోగలరు. బహుశా అవసరానికి మించి ఒత్తిడికి లోనయ్యానేమో? ఊహించనివిధంగా మానసిక కుంగుబాటుకు గురయ్యాను…. అంటూ తను అనుభవించిన ఒక దుర్భరమైన పరిస్థితిని గురించి చెప్పింది ఇలియానా
నన్ను నేను అనాకారిగా ఊహించుకోవటం మొదలు పెట్టాను. జిమ్‌కి వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుకుంటారని అక్కడికి వెళ్లటమే మానేశాను. ఉండాల్సిన బరువు కంటే  తక్కువే ఉన్నా, ఇంకా బరువు తగ్గాలని రోజంతా విపరీతంగా వ్యాయామాలు చేసేదాన్ని. ఆ సమయంలో అందరినీ దూరం పెట్టేయటం మొదలు పెట్టాను. అయితే అలా చేస్తున్నట్టు నా అంతట నేను గ్రహించలేకపోయాను. నిజం చెప్పాలంటే, డిప్రెషన్‌ సమస్య ఉందనీ నాకు తెలీలేదు.  చివరికి ఆండ్రూ చెప్పినట్లు మానసిక వైద్యుల్ని కూడా కలిశాను. క్లిష్ట కాలంలో చేయి అందించి ఆసరాగా నిలబడ్డ ఆండ్రూకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఓదార్పు అవసరమైనప్పుడు భుజాన్ని ఆసరా అందించే ఆండ్రూ లాంటి వాళ్లు దొరకటం నిజంగా అదృష్టం. ఎందుకంటే డిప్రెషన్‌ అనేది అంత తేలికగా లొంగేది కాదు!
డిప్రెషన్‌ గురించి మాట్లాడినప్పుడు స్టేజి మీదే ఏడ్చేశాను !
డిప్రెషన్‌ గురించి బహిరంగంగా మాట్లాడడం ఓ క్లీనింగ్‌ ప్రాసెస్‌. ఒక నటిగా నా మాటలు ఎంత మందిని ప్రభావితం చేస్తాయో తెలియదుగానీ, నా సమస్య గురించి మాట్లాడి మంచి పనే చేశాననిపిస్తోంది. భారతదేశంలో డిప్రెషన్‌ అనేది పెద్ద సమస్య. అదొక భావోద్వేగ స్థితి. చివరిసారి ఢిల్లీలో డిప్రెషన్‌ గురించి మాట్లాడినప్పుడు స్టేజి మీదే ఏడ్చేశాను. ఆండ్రూ, అతని తల్లి, మేనేజర్‌ నిమిష…ఆ సమయంలో నాకెంతో సహాయపడ్డారు. నిమిష నా కుంగుబాటును దగ్గర్నుంచి చూసింది.  పని చేయటం నా వల్ల కాదనీ, బెడ్‌ మీద నుంచి లేవలేననీ, గది నుంచి బయటకు రాలేననీ, ప్రజల్ని, వాళ్లు వేసే ప్రశ్నల్నీ ఎదుర్కొనే ధైర్యం నాకు లేదనీ ఆమెకి ఫోన్లు చేసి భోరుమనేదాన్ని. నిమిష అన్నీ ఓపిగ్గా వినేది. నన్నా స్థితి నుంచి బయటకు లాక్కొచ్చింది కూడా తనే! వృత్తిపరంగా గత ఏడాదంతా నాకు కలిసొచ్చింది. అయినా నాకు తృప్తి లేదు. సాధ్యమైనంత ఎక్కువ పని చేయాలి. అదే సమయంలో కుటుంబంతో కూడా కలిసి గడపాలి. ఒక నెల సెలవు తీసుకుని కుటుంబంతో గడపాలని అనుకుంటున్నాను. ఇక నుంచి ఏం జరిగినా ఎదుర్కోవటానికి నేను సిద్ధం. డిప్రెషన్‌ నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది!