ఎంత అందంగా ఉన్నా వంకలు పెట్టేవారుంటారు !

‘మనం ఎంత అందంగా ఉన్నామనుకున్నా వంకలు పెట్టేవారు మాత్రం ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు. వారిని సంతృప్తి పర్చడం మన వల్లకాదంటుంది’ గోవా బ్యూటీ ఇలియానా.‘డిప్రెషన్‌’, ‘శరీర సౌష్టవం’ గురించి ఏ బెరుకు లేకుండానే మాట్లాడుతుంది ఇలియానా. ప్రస్తుతం తన కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంది ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఆమె గతంలో చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫిజీలో విహారయాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఆండ్రూ తీసే ఫొటోలను ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంది.
 
ఈ విషయం గురించి మాట్లాడుతూ…తన ఫొటోలు అన్ని వేళల, అందరికీ నచ్చవని అంటోంది  ఇలియానా. తన ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తుంటాయని,  ఇక వాటి గురించి పట్టించుకోదలచుకోలేదని చెబుతున్నారు. ‘కొందరు శరీరాకృతికి సంబంధించిన విషయాలతో బాధపడుతుంటారు. నాకైతే ఆ బాధ కాస్త ఎక్కువే. కానీ నేను దిగే ప్రతి ఫొటోతో అందరిన్నీ మెప్పించలేనని నాకు అర్థమైంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అందర్నీ మెప్పించాలని అనుకునేదాన్ని. నేను ఏం చేసినా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావాలని కోరుకునేదాన్ని. కానీ అది సాధ్యం కాదనిపించింది. కాబట్టి నేను కూడా వారు చేసే కామెంట్స్‌ విని వదిలేయడం నేర్చుకున్నాన’న్నారు.
 
ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఆ సమయంలో నా ఫొటోలు తీయడం నాకు నచ్చదు. కానీ ఫ్యాన్స్ బాధపడతారని ఒప్పుకుంటాను. ఇన్నేళ్ల అనుభవంలో నాకు ఒక విషయం అర్థమైంది. మనం ఎంత అందంగా ఉన్నా జనాలు మనలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారన్నా’రు ఇలియానా. ఇలియానా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లో హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా రవితేజ – ఇలియానా కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది.