నన్ను నేనే ప్రేమించుకుంటున్నా!

”ఇక నేను ఎవ్వరినీ ప్రేమించడానికి సిద్ధంగా లేను. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా. నన్ను నేనే ప్రేమించుకుంటున్నా’ అని చెప్పింది ఇలియానా. “ప్రేమలో ఉండడం అనేది ఒకటైతే..నీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా, భద్రంగా ఉండగలుగుతున్నా కానీ.. మానసికంగా, ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ప్రధానం”…ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్వూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పింది.
 
ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ తో చాలా కాలం సహజీవనం సాగించాక ఈ ఏడాది ఆగస్టులో విడిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….
“నీకు నువ్వు రుణపడి ఉండు. నీకు నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. నేను థెరఫిస్టుని కలిశాక ఒక్క నిమిషంలోనే అలా ఉండాలని తెలిసింది. ఆ నిమిషంలోనే నా సమస్యల నుంచి బయటపడ్డాను. అదేదో మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా అంతర్గతంగా కూడా. నీకు గడ్డు కాలం నడుస్తుందనుకోండి…అప్పుడు నీ పని నువ్వే చేసుకోవాలి. అటువంటప్పుడు నువ్వు ఇతరులపై ఆధార పడకూడదు. ఎందుకంటే నీపై నువ్వే ఆధారపడి ఉన్నావు కాబట్టి. ఈ విషయాన్ని నేను థెరఫిస్టు దగ్గర చెబితే.. దాన్ని ఆవిడా ఆహ్వానించారు. నేనూ ఇదే సరైనదని భావించాను. అలానే ముందుకెళుతున్నా” అని పేర్కొంది ఇలియానా.
 
ఆండ్రూతో చాలా కాలం జీవితం పంచుకున్న ఇలియానా అతనితో విడిపోయాక తన సోషల్‌ మీడియా ఖాతాల్లో అతనితో కలసి దిగిన ఫొటోలన్నింటినీ తొలగించింది. ఆండ్రూ గురించి మాట్లాడుతూ… “నేను ఎప్పుడూ శత్రువులను పెంచుకోను. ఆయన నా నుంచి వెళ్లిపోయారు. అది అలా జరిగిపోయింది. జీవితం అలా సాగిపోతుంది. కానీ ఇతరుల ప్రేమను గౌరవిస్తాను. ఆయన గురించి ఎటువంటి చెడు ఆలోచన లేదు. అతనికీ అంతా మంచే జరగాలి” అని చెప్పింది ఇలియా. ఇలియానా ప్రస్తుతం ‘పాగల్‌పంటీ’ చిత్రంలో నటిస్తుంది. అభిషేక్‌ బచ్చన్‌తో ‘బిగ్‌ బుల్‌’లో కథానాయికగా చేస్తోంది.