సినిమా పరిశ్రమలో నేను ప్రత్యేకం !

ఇలియానా తన ప్రేమికుడు ఆండ్రూతో విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ‘పాగల్పంటి ‘లో నటించిన ఈమె తాజాగా మీడియాతో మాట్లాడింది. ‘నేను గొప్ప తల్లిదండ్రుల వద్ద పెరిగాను. నన్ను వాళ్లు చాలా క్రమశిక్షణగా పెంచారు. నేను ఎప్పుడూ నా వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఓ వ్యక్తిగా కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ. అవేవీ నా పనిపై ప్రభావం చూపవు. పని విషయానికి వచ్చే సరికి చాలా జాగ్రత్తగా ఉంటా. అక్కడ ఎటువంటి అభద్రతకు గురికాను.అటువంటి అవకాశం ఉండదు కూడా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు వేరు. కానీ సెట్‌లో సుమారుగా 20 మందితో కలసి పని చేస్తుంటాను. దాని వల్ల అభద్రతా భావం అన్నది ఎక్కడా కనిపించే అవకాశం ఉండదు. సినిమా ఇండిస్టీలో నేను ప్రత్యేకం. కానీ నాలాంటి వారు లేరని మాత్రం అనను. చాలా మంది అందంగా, స్మార్ట్‌గా ఉన్న మహిళలు ఉన్నారు. కానీ వాళ్లు నాలా ఉండలేరు. నేను వాళ్లలా ఉండలేను‘ అని చెప్పింది ఇలియానా.
 
సోషల్ మీడియాలో పెడతారని భయం
ఇలియానా బాలీవుడ్‌లో చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో మునిగిపోయింది. అయితే ఆ ప్రేమ ఎంతో కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా ఈ మధ్యనే బ్రేకప్‌ అయ్యింది. అయితే ఆండ్రూతో లవ్‌ బ్రేకప్‌ నటి ఇలియానాపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. దీని గురించి ఇలియానా చెబుతూ… “ఆ మనోవేదన నుంచి బయటపడడానికి వారమంతా ఆస్పత్రి చుట్టూ తిరిగాను. సినిమాల్లో నటించడం కూడా మానుకున్నానని చెప్పింది.మనో వేదనతో ఒక సమయంలో రోజుకు 12 మాత్రలు వేసుకున్నానని చెప్పింది. అందువల్ల బరువు పెరిగిపోయా… బరువు తగ్గడానికి జిమ్‌కు వెళదామనుకుంటే.. ఆ ఫొటోలను తీసి, ఎక్కడ సోషల్ మీడియాలో పెడతారోనన్న భయం కలిగేది. అందుకే జిమ్‌కు వెళ్లడం కూడా మానేశా… అలా కొంత కాలం గదిలోనే ఏకాంతంగా గడుపుతూ ..చాలా మానసికవేదనకు గురైనట్లు చెప్పింది . ఇలియానా ఇప్పుడు మళ్లీ నటనపై పూర్తిగా దృష్టిసారించినట్లు తెలిపింది. ఆమె ఇప్పటికే ‘అమర్ అక్బర్ అంధోనీ’ తెలుగు చిత్రంలో నటించినా.. అది సత్ఫలితాన్నివ్వలేదు.ప్రస్తుతానికి హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ దక్షిణాదిలో అవకాశాలకోసం ఎదురు చూస్తోంది
 
నేను చాలా సంపాదించాల్సి ఉంది
గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్‌పై దృష్టి సారించి అవకాశాలు అందుకుంటూ బాగానే సంపాదించింది. అయితే, ఇలియానాకు ఇంకా చాలా డబ్బులు కావాలట.గోవాలో సముద్రానికి ఎదురుగా ఇల్లు కట్టుకోవాలనేది ఇలియానా చిరకాల కోరికట… అందుకోసం చాలా డబ్బులు కావాలట… ఆ డబ్బులు వీలైనంత త్వరగా సంపాదించాలని కుంటోందట. ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన డ్రీమ్ గురించి చెప్పింది… `గోవాలో ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు సముద్రానికి దగ్గర్లోనే ఉంటుంది. కానీ, సముద్రానికి అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలనేది నా కల. వచ్చే ఏడాదైనా ఈ కల నెరవేరాలని కోరుకుంటున్నా. నా కలను నిజం చేసుకోవడానికి నేను చాలా సంపాదించాలి.. ఏదో ఒక రోజు కచ్చితంగా నా కల నెరవేరుతుంద`ని ఇలియానా చెప్పింది.