గాయపడి నేనుంటే..ఈ సెల్ఫీల గోలేంటి !

ఓ పక్క ప్రాణాలు పోతున్నా సరే సెల్ఫీలపై మమకారం మాత్రం తగ్గడం లేదు. సెల్ఫీలు తీసుకోవడమనేది ప్రస్తుతం సర్వత్రా ఓ పిచ్చిగా తయారైపోయింది.సోషల్‌ మీడియాలో లైకుల కోసం లైఫుల్నే పణంగా పెడుతున్నారు. ఫ్రెండ్స్‌తోనే సరిపెట్టుకోకుండా అపరిచితులు సైతం తమ ఫొటోలకు  మంచి కామెంట్స్‌ పెట్టాలనే పిచ్చి కోరికతో మానవత్వానికి తిలోదకాలిచ్చి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు.. దిగుతున్నారు. ఇలాంటి వైనాల్ని రోజూ మనం చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఈ తరహా సంఘటనతో బాలీవుడ్‌ నటి నేహా ధూపియా విస్తుపోయింది….

ఇటీవల రోడ్డు ప్రమాదంలో నేహా స్వల్పంగా గాయపడ్డారు. చండీగడ్‌ నుంచి ముంబయి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడంతో ఆమె భుజానికి గాయమైంది. అలాగే కాళ్లపై, చేతులపై కూడా గాయాలై రక్తం కారుతోంది.ఈ ప్రమాదం కారణంగా కిలోమీటర్‌ మేర గంటపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. గాయాల కారణంగా రోడ్‌కి ఓ వైపు కూర్చుని సహాయం కోసం నేహా ఎదురు చూస్తుంటే, అభిమానులు మాత్రం ఆమెతో సెల్ఫీలు దిగటం కోసం ఎగబడ్డారు.ఆమె అనుమతి లేకుండానే ఫొటోలు తీసుకున్నారు. సహాయం చేయకపోగా మరికొంత మందైతే ఏకంగా ఆటోగ్రాఫ్‌లు అడగటాన్ని చూసి నేహా నిర్ఘాంతపోయింది. బాధపడుతుంటే సాయం చేయాల్సిందిపోయి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు అడగడం పట్ల నేహా ఆవేదన వ్యక్తం చేసింది.