ముప్ఫై మూడేళ్ళకి సీక్వెల్ గా వెబ్ సిరీస్

హాలీవుడ్ చిత్రం ‘ది కరాటే కిడ్’ కు సీక్వెల్ రూపొందబోతోంది. అయితే అది సినిమా మాత్రం కాదట. 1984లో ప్రపంచవ్యాప్తంగా విజయఢంకా మోగించిన ‘ది కరాటే కిడ్’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటూనే ఉంది. 2010లో ఈ చిత్రానికి రీమేక్ చేయగా అది కూడా ఘనవిజయం సాధించింది. ఒరిజినల్‌లో రాల్ఫ్ మాచికో, పాట్ మొరిటా లీడ్ రోల్స్ చేయగా రీమేక్‌లో జాకీ చాన్, జేడన్ స్మిత్ అలరించారు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కబోతోంది. అయితే సీక్వెల్ సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ రూపంలో రూపొందబోతోందట.
 ‘ది కరాటే కిడ్’ సినిమా వచ్చి ఇప్పటికీ ముప్ఫై మూడు ఏళ్లు పూర్తవ్వగా తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ను రూపొందించాలని అందులోని లీడ్ యాక్టర్లు కంకణం కట్టుకున్నారు. అయితే సినిమా కథ ముగిసిన తరువాత జరిగే టోర్నమెంట్లు, తదనంతర పరిణామాలపై ఈ సీక్వెల్ రూపొందబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కోబ్రా కాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. 2018లో విడుదలవ్వనున్న ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉండనున్నాయి. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి