‘మహానటి’ కి జాన్వీకపూర్ స్వాగతం !

హీరోయిన్‌ కీర్తిసురేశ్‌కు ప్రశంసలు కొత్త కాదు. మాస్‌ మసాలా చిత్రాల్లో నటించినా రాని పేరు ఒక్క ‘మహానటి’తో తెచ్చుకుంది కీర్తి. అంతగా ఆ మహానటి (సావిత్రి) పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంతో ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంది. అయితే మహానటిని మెచ్చుకునేవారి జాబితాలోతాజాగా మరొకరు చేరారు. దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ తన సోషల్‌ మీడియాలో కీర్తిపై ప్రశంసలు కురిపించింది…. ‘మహానటి సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, ఆత్రుతగా ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం అని క్యాప్షన్‌తో ఫోటో పోస్టు చేసింది జాన్వీ.
 
ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ భార్యగా…
తాజాగా కీర్తికి బాలీవుడ్‌ అవకాశం వచ్చిన విషయం తెలిసిందే.
సావిత్రి జీవిత కథా చిత్రం ‘మహానటి’లో ప్రేక్షకుల్ని మెప్పించింది కీర్తిసురేష్. తాజాగా ఆమె మరో బయోపిక్‌లో నటించబోతున్నది. 1956 ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టును సెమీఫైనల్‌కు చేర్చి చరిత్రను సృష్టించిన హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ జీవితకథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. రహీమ్ కోచ్‌గా ఉన్న 1950 నుంచి 1963 కాలాన్ని భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణయుగంగా చెబుతుంటారు. రహీమ్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ అమిత్‌శర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో అజయ్‌దేవ్‌గన్ నటిస్తున్నారు. ఆయన భార్యగా కీర్తిసురేష్ నటిస్తున్నది. బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గొప్ప చరిత్రలో భాగం కావడం గర్వంగా ఉంది. భాషాప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ కీర్తిప్రతిష్టల్ని ఇనుమడింపజేసిన మహా వ్యక్తి కథ ఇది అని కీర్తిసురేష్ తెలిపింది. జూన్ నుండి ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.