పదిహేడేళ్లలోపు నటీనటులతో ‘అవతార్‌’ సీక్వెల్స్ !

“అవతార్‌” అనే అద్భుత లోకాన్ని సృష్టించి.. అందులో గ్రాఫిక్స్‌  మాయాజాలంతో ప్రపంచాన్ని కట్టిపడేశాడు దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఊహకందని ఆ విజువల్స్‌ గురించి ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. అలాంటిది ఆ చిత్ర సీక్వెల్స్‌ను మొదలుపెట్టి వచ్చే ఎనిమిదేళ్లలో ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నాడు.

అయితే మొదటి పార్ట్‌ లో పెద్ద నటీనటులనే ఎంచుకున్న ఆయన ఇప్పుడు మాత్రం ఆ పని చేయబోవటం లేదు. సుమారు 6 నుంచి 17 ఏళ్లలోపు వాళ్లనే ప్రధాన తారాగణంగా ఎంచుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ పోస్టర్‌ను కూడా వదిలారు. ఆ నటుల్లో ఒకరైన బ్రిటైన్‌ డాల్టన్‌ తన ట్విట్టర్‌ పేజీలో ఈ విషయాన్నితెలియజేశాడు. కొద్ది సంవత్సరాల పాటు తాము ‘అవతార్‌’ సినిమాలతోనే గడపబోతున్నామంటూ ప్రకటించాడు. స్టార్‌ నటీనటులు లేకుండా అవతార్‌ సిరీస్‌ను తెరకెక్కించాలన్న కామెరూన్‌ నిర్ణయం చర్ఛనీయాంశంగా మారింది. గతంలో హాలీవుడ్‌లో ‘నార్నియా’ సిరీస్‌ కూడా పిల్లలతో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్న బడ్జెట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక బిలియన్ డాలర్లు (దాదాపు 6539 కోట్లు) సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్నట్లు నిర్మాత జాన్‌ లన్‌డౌ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తొలి సీక్వెల్ ‘అవతార్-2’ను 2020 డిసెంబర్ 18న విడుదల చేస్తుండగా, 2021 డిసెంబర్ 17న ‘అవతార్-3’ని, 2024 డిసెంబర్ 20న ‘అవతార్-4’, 2025 డిసెంబర్ 19న ‘అవతార్-5’ని రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా.