కళ్ళద్దాలు లేకుండానే 3డి “అవతార్”

“అవతార్” తొలి భాగంతో మోషన్ క్యాప్చర్ అనే సరికొత్త టెక్నాలజీని ప్రపంచ సినిమాకు పరిచయం చేసిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ త్వరలో రానున్న సీక్వెల్స్‌తో మరో ప్రయోగానికి తెరతీసినట్లు సమాచారం.జేమ్స్‌కామెరాన్ అద్భుత సృష్టి “అవతార్”. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2009లో వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం వరుసగా నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు.

త్రీడీ టెక్నీలజీతో రూపొందిన చిత్రాల్ని ప్రత్యేకమైన కళ్లజోడు ద్వారానే త్రీడీలో చూడగలం కానీ “అవతార్-2” చిత్రాన్ని మాత్రం ఎలాంటి త్రీడీ గ్లాసెస్‌ను ఉపయోగించకుండా త్రీడీలో వీక్షించే విధంగా రూపొందిస్తున్నారని తెలిసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న “అవతార్” సీక్వెల్స్ కోసం ఆర్‌జీబీ అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారని, దాని కారణంగానే ఎలాంటి త్రీడీ గ్లాసెస్‌ను ఉపయోగించకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడొచ్చని హాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సాంకేతికను ఉపయోగిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. కాగా ఈ చిత్రాన్ని 2020 డిసెంబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.