జేమ్స్ కామెరూన్ ‘అవతార్-2’ వచ్చేస్తోంది !

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ 2009లో తెరెక్కించిన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. సహజవనరుల కోసం మనుషులు పాండోరా గ్రహానికి వెళ్లడం, అక్కడ నావీ అనే జాతికి చెందిన జీవులతో యుద్ధం, వారికి హీరో సాయం చేయడం వంటి ఆసక్తికరమైన మలుపుతో సినిమాను కామెరూన్ అద్భుతంగా తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా మరో 4 సీక్వెల్స్ ఉంటాయని అప్పట్లోనే కామెరూన్ ప్రకటించారు. తాజాగా అవతార్-2కు సంబంధించిన తేదీని ఆయన ప్రకటించారు. 2021, డిసెంబర్ 17న తాము అవతార్-2ను రిలీజ్ చేస్తామని కామెరూన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించారు. 2021 డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్‌ అవుతుందంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమా సీక్వెల్‌ 2020 డిసెంబర్‌లోనే రిలీజ్‌ అవుతుందని భావించినా నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాడు వాయిదా పడింది. 3,4,5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.
 
ఈ సినిమాకు టైటిల్ ను కామెరూన్ ప్రకటించనప్పటికీ..‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ అనే పేరును ఖరారు చేయవచ్చని హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రధానంగా పాండోరా గ్రహంపై ఉన్న సముద్రాలపై ఉంటుందని పేర్కొన్నాయి. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’ 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి వరకు ఉన్న హాలీవుడ్‌ కలెక్షన్‌ రికార్డులన్నింటినీ చెరిపేసిన అవతార్‌ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఆల్‌టైం రికార్డ్‌ను సృష్టించింది. ‘అవతార్-1’ సినిమాను రూ.1,648 కోట్లతో తెరకెక్కించగా, ఏకంగా రూ.రూ.20,455 కోట్ల కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది.ఇటీవల రిలీజ్‌ అయిన ‘అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌..’ ‘అవతార్‌’ రికార్డ్‌లను చెరిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరో ‘అవతార్‌ 2’తో మరోసారి కామెరూన్‌ ఆల్‌టైం రికార్డ్‌ను సాధిస్తాడేమో చూడాలి.