దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ‘జనతా హోటల్’. మలయాళంలో ఘనవిజయం సాధించి అంతర్జాతీయ ఫిలింఫెస్టివల్‌కి ఎంపికైన ‘ఉస్తాద్ హోటల్’ను తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 14న) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రివ్యూ ప్రదర్శించారు. అనంతరం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ హోటల్ చైన్ గ్రూప్ అధినేత, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు, చిత్ర నిర్మాత సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు సహా ప్రొఫెషనల్ చెఫ్‌లు పాల్గొన్నారు. ‘జనతా హోటల్’ ప్రివ్యూ వీక్షించిన హోటల్ చెఫ్స్ ఎంతో ఉద్వేగంగా సినిమాపై తమ అభిప్రాయాల్ని తెలిపారు. మంచి భోజనం మనసుతో వండి వడ్డిస్తేనే రుచికరంగా ఉంటుందన్న సందేశాన్ని ఈ సినిమా ఇచ్చిందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ హోటల్స్ అసోసియేషన్’ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ… ‘‘ఈ సినిమా చూస్తున్నంత సేపూ నా జీవితం గుర్తుకొచ్చింది. ఇందులో సగభాగం నా లైఫ్‌తో ముడిపడిన సన్నివేశాలే. హోటళ్ల పరిశుభ్రత, రుచికరమైన వంట అన్న పాయింట్‌ని రియాలిటీలోనూ హోటల్ ఇండస్ట్రీస్‌లో మేం అనుసరించాం. తక్కువ ధరకు పేదలకు భోజనం అందించాలన్న కాన్సెఫ్ట్‌తో తొందర్లోనే ఇదే సినిమా టైటిల్ (జనతా హోటల్)తో హోటల్స్‌ని ప్రారంభిస్తాం’’ అన్నారు.
చిత్ర నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ… ‘‘ప్రేమిస్తే, జర్నీ తరహాలోనే మంచి కంటెంట్ ఉన్న చిత్రం ‘జనతా హోటల్’. హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన సందేశాన్నిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకున్నప్పుడు తొలిగా గుర్తుకొచ్చింది రాజుగారి పేరు. హోటల్ రంగంలో గొప్ప పేరున్న నాగరాజుగారు మా సినిమాకి ప్రమోషన్ చేయడం ఆనందంగా ఉంది. రేడియో మిర్చి వారు చెఫ్‌ల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం ఐడియా నచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథానాయిక నిత్యామీనన్ సూచన మేరకు జనతా హోటల్ టైటిల్‌ని నిర్ణయించాం. ఈనెల 14న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ప్రేమిస్తే, జర్నీ అంత పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’ అన్నారు.